గుంటూరు: తనను వేధించిన వారు పోయారని ప్రపంచ శాంతి మిషన్ వ్యవస్థాపకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఆదివారం గుంటూరు జిల్లాలో అన్నారు. వితంతువులు, వికలాంగులు, పేదలకు పీస్ మిషన్ ద్వారా తాను వేల కోట్లు పంపిణీ చేస్తున్నానని, అలాంటి తనను వేధించి, బాధించిన వారు చనిపోయారని ఆయన అన్నారు. శాంతిమహోత్సవాల నిర్వహణ నిమిత్తం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఆదివారం జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తనను వ్యక్తిగతంగా వేధింపులకు గురి చేశారన్నారు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తన పీస్ మిషన్ బోర్డు సభ్యుల సహకారంతో వేధింపులకు గురి చేశారన్నారు. దీంతో తన మిషన్ ద్వారా సహాయం పొందే వారి ప్రార్థనలు, తన కన్నీటి ప్రార్థనలను దేవుడి ఆలకించి, బోర్డు సభ్యుల్లో ఆరుగురు, మరో రాజకీయ నాయకుడిని దేవుడు శిక్షించాడని అన్నారు. అవినీతి నిర్మూలనకే ప్రజాశాంతి పార్టీ పోరాడుతుందని చెప్పారు.
రానున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టే యోచనలో ఉన్నట్లు కెఎ పాల్ చెప్పారు. అభ్యర్థులను నిలబెట్టే విషయమై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ పోటీ చేయని పక్షంలో ఏ పార్టీకి మద్దతిస్తామో అప్పుడే తెలియజేస్తామని ఆయన అన్నారు. పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమంటుకు జరగనున్న అన్ని నియోజకవర్గాలలో తాను త్వరలో పర్యటిస్తానని కెఏ పాల్ చెప్పారు. ఎన్నికలయ్యాక పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు.