కర్నాటక సీఎం మార్పుపై తేల్చేసిన కాంగ్రెస్-రాజ్యసభ ఎన్నికల వేళ..!
కర్నాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్దరామయ్యను మారుస్తారా లేదా అన్న దానిపై కాంగ్రెస్ పార్టీ (Congress) అధిష్టానం ఇవాళ క్లారిటీ ఇచ్చేసింది. నిన్న ఉన్నట్లుండి హఠాత్తుగా ఆయన్ను, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ఢిల్లీకి రావాలని అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో కర్నాటకలో సీఎం మార్పు తప్పదన్న ఊహాగానాలు వెలువడ్డాయి. పార్టీ ఆదేశాల మేరకు ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఇద్దరికీ అధిష్టానం నేతలు షాకిచ్చారు.
నిన్న అజెండా కూడా ఏంటో చెప్పకుండా ఢిల్లీకి రావాలని ఆదేశాలు రావడంతో తన పీఠానికి ముప్పు తప్పదన్న టెన్షన్ లో ఉన్న సీఎం సిద్దరామయ్యతో పాటు ఈసారి కచ్చితంగా తనకే పగ్గాలు ఇచ్చేస్తారని భావించి హస్తిన వెళ్లిన డీకే శివకుమార్ ఇద్దరినీ ఇతర నేతలతో కలిపి కూర్చోబెట్టి అధిష్టానం పెద్దలు చర్చించారు. కర్నాటకలో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికపై వీరిద్దరితో మాట్లాడారు. అనంతరం ఇద్దరికీ భోజనాలు పెట్టి పంపేశారు. దీంతో వీరిని ఢిల్లీకి పిలిపించింది కర్నాటకలో సీఎం మార్పు గురించి కాదని, రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక గురించి మాత్రమేనని అర్దమైంది.

సమావేశం ముగిసిన అనంతరం సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరి సమక్షంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. చర్చలు కేవలం జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల గురించే జరిగాయని ప్రకటించారు. దీంతో కర్నాటకలో సీఎం పీఠం మార్పుపై గత 24 గంటల్లో వచ్చిన ఊహాగానాలు అన్నీ ఒట్టివే అని తేలిపోయింది. మరోవైపు రాష్ట్రంలో కేబినెట్ మార్పులపైనా ఇవాళ చర్చ జరుగుతుందని భావించినా కేవలం రాజ్యసభ సీట్లకు అభ్యర్ధుల ఎంపికకే ఈ భేటీని అధిష్టానం పరిమితం చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications