మరోసారి పీక్స్ కు యుద్ధం.. అమెరికా MQ-9 రీపర్ డ్రోన్ ను కూల్చేసిన ఇరాన్.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కూరుకుపోయాయి. పేద, మధ్య తరగతి దేశాలతోపాటు అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఆ లిస్టులో భారత్ కూడా ఉంది. చమురు సంక్షోభం కారణంగా ఇప్పటికే భారత్ లో 10 రోజుల వ్యవధిలో ఏకంగా నాలుగుసార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ ను కూల్చేసినట్లు ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ కార్ప్స్ కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ రీజియన్ లో తమ వైమానిక పరిధిలోకి ప్రవేశించిన అమెరికాకు చెందిన అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్ న తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చి వేసినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ప్రకటించింది. ఈ దాడితో పాటు అదే సమయంలో ఇరాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన మరొక అమెరికన్ ఆర్ క్యూ-4 డ్రోన్ అలాగే ఎఫ్-35 ఫైటర్ జెట్స్ పైనా తాము దాడులు చేయడంతో అవి వెనక్కు తగ్గాయని స్పష్టం చేసింది.

ఇక ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలో అమెరికా సైన్యం చేస్తున్న ఇలాంటి ఉల్లంఘనలపై వెంటనే స్పందించే హక్కు తమకు ఉందని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ కు చెందిన కొన్ని నౌకలపై అమెరికా బలగాలు దాడులు చేసినట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఇరాన్ ఈ డ్రోన్ ను కూల్చివేయడం గమనార్హం. అయితే ఈ ఘటనకు సంబంధించి అమెరికా రక్షణ విభాగం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ధ్రువీకరణ రాలేదు. మరోవైపు ఈ ఘటనతో ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications