గవర్నర్‌కు పిలుపు: జగన్ కేసు, విభేదాలపై నివేదికకే?

ఇప్పుడు గవర్నర్‌కు కూడా పిలుపు రావడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో అధిష్టానం ప్రస్తుతం తెలంగాణ, వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిల రూపంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. పిసిసి చీఫ్, సిఎంల మధ్య విభేదాలు మరింత తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ నుండి పూర్తి సమాచారాన్ని అధిష్టానం రాబట్టనుందని తెలుస్తోంది. తెలంగాణ పరిస్థితిలో మార్పుపై గవర్నర్ నుండి నివేదిక కోరనుంది.
జగన్మోహన్ రెడ్డి కేసు ఇష్యూ పైనా అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించిందని అంటున్నారు. ఇప్పటికే జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఛార్జీషీటు దాఖలు చేసినందున ఆయనను అరెస్టు చేస్తే, చేయకుంటే వచ్చే పరిణామాలపై పూర్తి స్థాయి నివేదిక కోరనుందని తెలుస్తోంది. ఒకవేళ ఆయనను అరెస్టు చేస్తే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోనుంది. పిసిసి చీఫ్, సిఎం మధ్య ఉన్న విభేదాలను ప్రతిపక్షాలు ఏ విధంగా లబ్ధి పొందాలని చూస్తున్నాయో కూడా నివేదిక కోరనుందని తెలుస్తోంది.
రాష్ట్రంలో పార్టీని పూర్వస్థితికి తీసుకు రావడానికి ఏం చేయాలో గవర్నర్‌ను కోరనుందని తెలుస్తోంది. గవర్నర్‌తో పాటు పార్టీలో నమ్మకమైన నేతల నుండి కూడా విభేదాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సమాచారం సేకరిస్తోంది. ఇప్పటికే పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్ నుండి అధిష్టానం రిపోర్టు తీసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బుధవారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తున్నారు. వీరే కాకుండా ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబి) నుండి కూడా కాంగ్రెసు పెద్దలు రిపోర్ట్స్ కోరుతున్నట్లుగా తెలుస్తోంది.