అండగా ఉంటాం: బాబుతో మళ్లీ రాజీకొచ్చిన హరికృష్ణ!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన సంస్కరణల కారణంగానే కాంగ్రెసు లబ్ధి పొందుతోందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. అప్పుల ఊబిలో ముంచుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రికే బెదిరింపులు వస్తే ప్రజల పరిస్థితి ఏమిటన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెసు పాలన బృహన్నలగా ఉందన్నారు. కాంగ్రెసు వారు నాటకలలో ఉండేవారిలా ఉన్నారన్నారు. 1983లో స్వర్గీయ ఎన్టీఆర్‌ను ఎవరో పిలిస్తే రాజకీయాలలోకి రాలేదని, ప్రజా సంక్షేమం కోసం వచ్చారన్నారు. 1983కు ముందు తెలుగువారి ఆత్మగౌరవనాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్లు ఇప్పుడు కూడా పెడుతున్నారన్నారు. మన ముఖ్యమంత్రిని మనం ఎన్నుకోలేమా అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబుతో విభేదాలపై ఆయన వేరుగా స్పందించారు. టిడిపి అధినేతతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. నందమూరి కుటుంబం టిడిపి అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ వంటి ప్రత్యేక కారణం వల్లనే పార్టీ ఓటమి చెందిందన్నారు.
కాగా ఇటీవల న్యూఢిల్లీలో హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. నాయకత్వ లోపం వల్లనే పార్టీ ఈ పరిస్థితిల్లో ఉందని, కార్యకర్తలను నాయకులను ప్రశ్నించాలని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరికృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు చంద్రబాబును ఉద్దేశించే అన్నారనే వాదనలు వినిపించాయి.