వైయస్‌పై బొత్స ప్రశంసలు: వైయస్ జగన్ ఆటలు

వచ్చే ఉప ఎన్నికల్లో వైయస్ జగన్‌ను టార్గెట్ చేసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన సూచన వైయస్ పట్ల వైఖరి పట్ల నెలకొన్న అయోమయం కూడా అడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో కాంగ్రెసు పార్టీలోని విభేదాలను ఆయన వాడుకుంటున్నట్లు చెబుతున్నారు. తాజాగా, సోమవారం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు బిడ్డ అని, వైయస్ జగన్ వైయస్ ఆస్తికి మాత్రమే వారసుడని ఆయన అన్నారు. ఇది కాంగ్రెసులోని వైయస్ ప్రత్యర్థుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.
వైయస్ జగన్‌ను అవినీతిపరుడంటూ వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రశంసించలేమని కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివా రెడ్డి, తదితరులు అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని జగన్ అవినీతిని విడదీయలేమని ఆయన అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి దళితులకు అన్యాయం చేశారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు జెడి శీలం అన్నారు. వి హనుమంతరావు వంటి కాంగ్రెసు సీనియర్ నాయకులు కూడా వైయస్ రాజశేఖర రెడ్డిని సొంతం చేసుకోవడానికి సిద్దంగా లేరు.
కాగా, తాను వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించలేనని కాంగ్రెసు రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయి ప్రతాప్ అన్నారు. రాజశేఖర రెడ్డిని విమర్సించాల్సి వస్తే తాను పార్లమెంటు సభ్యత్వానికైనా రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. తనకు వైయస్‌తో సుదీర్ఘమైన స్నేహం ఉందని, వైయస్‌ను విమర్శించడం కన్నా పదవి నుంచి తప్పుకోవడానికే ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి పట్ల అనుసరించాల్సి వైఖరిపై కాంగ్రెసు పార్టీ నాయకుల్లో ఉన్న విభేదాలు వచ్చే ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందిని కలిగించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
వైయస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పుడు అంటున్న నేతల తీరును మాజీ మంత్రి పి. శంకరరావు తప్పుడు పట్టారు. తాను కోర్టులో కేసు వేసినప్పుడు వారు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డారనే పేరు వైయస్ రాజశేఖర రెడ్డికి ఉందని, 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్లమెంటు సీట్లు పెరిగినా అసెంబ్లీ స్థానాలు తగ్గాయని ఆయన అన్నారు. ఇలా శంకరరావు, డిఎల్ రవీంద్రా రెడ్డి వంటి కాంగ్రెసు నాయకుల తీరు వైయస్ రాజశేఖర రెడ్డి విషయంలో మరో విధంగా ఉంది. ఏమైనా, కాంగ్రెసు పార్టీలో వైయస్ విషయంలో గందరగోళం ఇప్పట్లో సమసిపోయే విధంగా లేదు.












Click it and Unblock the Notifications