చిరంజీవి లేఖను తేలిగ్గా తీసుకున్న ముఖ్యమంత్రి?

ముఖ్యమంత్రి అసహనంతోనే చిరంజీవి ఆ లేఖ రాసినట్లు అనుమానిస్తున్నారు. చిరంజీవి అసహనానికి వేరే కారణాలున్నాయని ముఖ్యమంత్రి వర్గీయులు వాదిస్తున్నారు. నాయకుల అసహనానికి వేరే కారణాలుంటాయని, ఆ కారణాలను దాచేసి వేరే కారణాలతో అసహనాన్ని, అసంతృప్తిని నాయకులు వ్యక్తం చేయడం సాధారణమని ముఖ్యమంత్రి చిరంజీవి రాసిన లేఖపై అన్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి కేంద్ర మంత్రివర్గంలో ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా చేరిపోవాలనే ఉద్దేశంతో ఉన్నారని, కేంద్ర మంత్రి వర్గంలో చేరకుండా ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారనే అభిప్రాయంతో చిరంజీవి ఉన్నారని, అందుకే ముఖ్యమంత్రికి చిరంజీవి లేఖ రాశారని కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు అంటున్నారు.
ఉప ఎన్నికలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఉప ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం చేసేది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. గతంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు సన్నిహితంగా ఉంటూ వచ్చిన చిరంజీవి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో దూరమైనట్లు చెబుతున్నారు.
బొత్స సత్యనారాయణ చిరంజీవిని వెంటేసుకుని పర్యటనలు చేస్తూ తనకు ఎసరు పెడుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి గతంలో భావించారని అన్నారు. దాంతోనే కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవిని దగ్గర చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. స్వయంగా చిరంజీవి నివాసానికి వెళ్లి పార్టీ పరిణామాలపై, తాజా పరిస్థితులపై వివరించారు. తాను తీసుకునే నిర్ణయాలను చిరంజీవితో చర్చించేవారు. కానీ బొత్స సత్యనారాయణకు దూరమై, రాజ్యసభకు ఎన్నికైన తర్వాత చిరంజీవిని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఉంది.












Click it and Unblock the Notifications