దీదీగిరి: పార్టీలో చేరనందుకు మహిళపై టిఎంసి జులుం

తృణమూల్ కాంగ్రెసులో చేరేందుకు నిరాకరించినందుకు కొంత మంది తన తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తమ కుటుంబ సభ్యులను కొట్టారని టోటోన్ దాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని మారిష్దా పోలీసు స్టేషన్ డ్యూటీ ఆఫీసర్ చెప్పారు. దాంతో ఆ మహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు కూడా చెప్పారు. ఈ సంఘటన బుధవారంనాడు వెలుగు చూసింది.
ఈ సంఘటన ఏప్రిల్ 15వ తేదీన చోటు చేసుకుంది. పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. తన ఫిర్యాదులో దాస్ 21 మంది పేర్లను చేర్చాడు. కోల్‌కత్తాకు 150 కిలోమీటర్ల దూరంలో గల కనియాదిఘి గ్రామానికి చెందిన దాస్ ఆ ఫిర్యాదు ఇచ్చాడు. తాను ఫిర్యాదు ఇచ్చి 24 గంటలు దాటిన తర్వాత కూడా పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని అతను ఆరోపిస్తున్నాడు. దాడి చేసినవారు స్వేచ్ఛగా తిరుగుతుంటే తన తండ్రి పారిపోవాల్సి వచ్చిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
తృణమూల్ కాంగ్రెసు పార్టీ సమావేశానికి రావాలని కొంత మంది చెప్పారని, తాను నిరాకరించడంతో తనపై, తన కుటుంబ సభ్యులపై దాడి చేశారని దాస్ తల్లి చెబుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాను సిపిఎం సభ్యురాలిని అయినందున 50 వేల రూపాయలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారని ఆమె ఆరోపిస్తోంది. ఆమె కోంటాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సారా బట్టీని ధ్వంసం చేసినందుకు వారు తమ కుటుంబంపై కక్ష కట్టారని ఆమె ఆరోపించింది.












Click it and Unblock the Notifications