మళ్లీ జైలుకు: హైకోర్టులో విజయసాయికి చుక్కెదురు

విజయ సాయి రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి సిబిఐ ప్రత్యేక కోర్టు చెప్పిన కారణాలు సరికాదని హైకోర్టు పేర్కొంది. సరైన అంశాలను పరిగణలోకి తీసుకోలేదని చెప్పింది. బెయిల్ పిటిషన్ పైన మరోసారి విచారణ జరపాలని సిబిఐ కోర్టుకు సూచించింది. విజయ సాయి రెడ్డి లొంగిపోవాలని చెప్పింది. ఈ వ్యవహారం సిబిఐ కోర్టులోనే తేల్చుకోవాలని, అవసరమైతే అక్కడ మరోసారి బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చునని తెలిపింది. అయితే లొంగిపోతేనే విచారణ జరుగుతుంది కదా అని పేర్కొంది. ఉత్తర్వులు అందాక ఆయన లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి.
కాగా విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పైన గురువారం హైకోర్టులో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. సాయి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో సిబిఐ గత సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా విజయ సాయి తరఫు న్యాయవాది సుషీల్ కుమార్.. ఛార్జీషీటులో సిబిఐ చెప్పినవి అన్నీ కట్టుకథలేనని కోర్టుకు తెలిపారు. విజయ సాయి ఎక్కడకు వెళ్లినా ఇంటెలిజన్స్ వర్గాలు వెంబడిస్తున్నాయని అన్నారు.
ఎఫ్ఐఆర్‌లో డెబ్బై రెండు మందిని నిందితులుగా పేర్కొన్న సిబిఐ కేవలం విజయ సాయిని మాత్రమే ఆరెస్టు చేసిందని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఛార్జీషీటులో కూడా పదమూడు మందినే పేర్కొందన్నారు. ఇదే కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రులు, పద్నాలుగు మంది ఐఏఎస్ అధికారులను సిబిఐ అధికారులు ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. దర్యాఫ్తు పూర్తయ్యాకే ఛార్జీషీట్ దాఖలు చేయాలనే విషయం సిబిఐకి తెలియదా అన్నారు.
26 జివోలు జారీ చేసిన వారిని పక్కకు పెట్టడమేమిటన్నారు. అందుకు సిబిఐ తరఫు న్యాయవాది.. జగన్ ఆస్తుల కేసులో విజయ సాయి రెడ్డి పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పారు. వివిధ కంపెనీల నుండి విజయ సాయి రెడ్డి భారీగా నిధులను మళ్లించారని చెప్పారు. ప్రతిఫలంగా ఆయా కంపెనీల నుండి లబ్ధి పొందారని చెప్పారు. ఆయన బెయిల్ రద్దు చేయాలని సూచించారు.
వాదనలు విన్న కోర్టు ఈ కేసులో కోర్టులో దాఖలు చేసిన పత్రాలను విజయ సాయి తరఫు న్యాయవాదికి ఇవ్వాలని సిబిఐకి కోర్టు సూచించింది. అయితే అలా ఇస్తే ఇబ్బందులు తలెత్తుతాయని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం తీర్పును వెలువరించింది. ఈ నెల 13న విజయ సాయి రెడ్డికి బెయిల్ లభించింది.
కాగా జగన్ ఆస్తుల కేసులో తదుపరి దర్యాఫ్తుకు అనుమతి ఇవ్వాలన్న సిబిఐ పిటిషన్ పైన విచారణను సిబిఐ ప్రత్యేక కోర్టు వచ్చే నెల 2వ తేదికి వాయిదా వేసింది. మరోవైపు వచ్చే సోమవారం రోజు తాను కోర్టులో లొంగిపోతానని విజయ సాయి రెడ్డి హైకోర్టుకు తెలిపారు. అదో రోజు వాదనలు, తీర్పు పూర్తయ్యేలా సిబిఐ కోర్టుకు సూచించాలని విజయ సాయి తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. అందుకు కోర్టు అంగీకారం తెలిపింది.












Click it and Unblock the Notifications