టి- ఎంపీలపై సోనియా గుర్రు, చిరుకు మంత్రి పదవి

బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులతో పాటు తెలంగాణ కాంగ్రెసు, తెలుగుదేశం సభ్యులు లోకసభ సమావేశాలను అడ్డుకుంటున్నారు. రెండో విడత సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజు నుంచే తెలుగుదేశం తెలంగాణ ప్రాంత సభ్యులతో పాటు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సభ్యులు వెల్‌లోకి దూసుకుని వెళ్లి ఆందోళనకు దిగారు. దాంతో తమ పార్టీ సభ్యులను సస్పెండ్ చేయించడానికి సోనియా గాంధీ వెనకాడలేదని అంటున్నారు.
కాగా, చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో తమను మంత్రి పదవుల నుంచి తప్పించాలని, తాము పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తామని నలుగురు కేంద్ర మంత్రులు సోనియాకు లేఖలు రాశారు. సోనియా సూచన మేరకే వారు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి, బడ్జెట్ సమావేశాల తర్వాత పార్టీలోనూ ప్రభుత్వంలోనూ భారీ మార్పులు ఉండవచ్చునని చెబుతున్నారు.
భారీ మార్పులకు అనుగుణంగా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో రాష్ట్రానికి చెందిన చిరంజీవికి, రేణుకా చౌదరికి మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. అయితే, చిరంజీవికి పిసిసి అధ్యక్ష పదవిని అప్పగించే ఆలోచన కూడా లేకపోలేదని అంటున్నారు. పిసిసి పదవి నుంచి బొత్స సత్యనారాయణను తప్పిస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన స్థానంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకుడికే పిసిసి పదవి అప్పగించాలనే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ కూడా పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవిని ప్రచారం కోసం వాడుకుంటూ సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దే నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా నియమించదలుచుకుంటే కన్నా లక్ష్మి నారాయణకు అవకాశం లభించవచ్చునని అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండానే 2014 ఎన్నికలను ఎదుర్కోవడానికి సోనియా గాంధీ సిద్దపడుతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications