వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎంపీలపై వేటు పడింది, 4 రోజులు సస్పెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar-Vivek
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులపై లోకసభ స్పీకర్ మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఎంపీలు సభలో తెలంగాణ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో స్పీకర్ పలుమార్లు వారికి సభను అడ్డుకోవద్దని సూచించారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. జై తెలంగాణ, తెలంగాణను వెంటనే తేల్చాలంటూ వారు సభలోనే బైఠాయించారు. వెల్ లోకి దూసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు.

దీంతో స్పీకర్ వారిపై నాలుగు రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కీ, మంద జగన్నాథం, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బలరాం నాయక్, రాజయ్యలపై సస్పెన్షన్ వేటు వేశారు. అంతకుముందు అధికార పార్టీకి చెందిన ఎంపీలే సభను అడ్డుకునేలా ప్రవర్తించడంపై అధిష్టానం వారిపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

కాగా స్పీకర్ సస్పెండ్ చేసినప్పటికీ ఎంపీలు సభ నుండి బయటకు రాలేదు. సభలోనే తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో సభను బుధవారానికి వాయిదా వేశారు. కాగా తెలంగాణ ఎంపీలపై సస్పెన్షన్ వేటును పలువురు తెలంగాణ వాదులు, తెలంగాణవాద పార్టీలు ఖండించాయి.

తెలంగాణ కోసం సభలో ప్రశ్నిస్తున్న ఎంపీలను సస్పెండ్ చేయడం అసాంఘీకమని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. దేశంలోనే అతిపెద్ద సమస్య అయిన తెలంగాణను కేంద్రం పక్కకు పెట్టడం శోచనీయమన్నారు. తెలంగాణ కోసం అధికార పార్టీ ఎంపీలు సభను అడ్డుకోవడం హర్షనీయమన్నారు.

కేంద్రం ఎంపీలపై వేటు వేయడం కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేత జగదీశ్వర రెడ్డి అన్నారు. కేంద్రం 2009 డిసెంబర్ 9న ప్రకటించిన తెలంగాణను, గతంలో ఉన్న తెలంగాణనే మేం అడుగుతున్నామన్నారు. తెలంగాణ కోసం పోరాడితే సస్పెన్షన్ వేటు వేయడం దారుణమన్నారు.

సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం దానిని చూసి పారిపోవడం సిగ్గు చేటు అన్నారు. సొంత పార్టీ ఎంపీల పైన వేటు వేయడం ద్వారా తెలంగాణ పట్ల ఏ రకమైన వివక్ష ఉందో అర్థమవుతోందన్నరు. సభలో తెలంగాణ కోసం గళమెత్తినందుకు, సభను అడ్డుకున్నందుకు వారిని అభినందిస్తున్నట్లు చెప్పారు.

కాగా అంతకుముందు పార్లమెంటు సమావేశాలకు అడ్డు తగలవద్దని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులకు సూచించారు. అయినా వారు ఆయన మాట వినకుండా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. తెలంగాణపై తక్షణమే చర్చించాలని కోరుతూ తెలుగుదేశం లోకసభ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. తమ నోటీసును అనుమతించాలని కోరుతూ తెలుగుదేశం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో ఆందోళనకు దిగారు.

వారితో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కలిసి తెలంగాణ నినాదాలు చేశారు. స్పీకర్ వెల్‌లోకి వెళ్లి వారంతా నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలు స్తంభించడంతో కాంగ్రెసు అధిష్టానం తీవ్ర చిక్కుల్లో పడింది. దీంతో కాంగ్రెసు కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశమై ఏం చేయాలనే విషయంపై ఆలోచన చేసింది. తెలంగాణ పార్లమెంటు సభ్యులతో ఓసారి మాట్లాడాలని అధిష్టానం గులాం నబీ ఆజాద్‌కు సూచించింది.

వినకపోతే సభ నుంచి వారిని సస్పెండ్ చేయాలనే ఆలోచన అధిష్టానం చేసింది. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి మంగళవారం సభకు రాలేదు. తాము ఆందోళన చేస్తున్నప్పుడు యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ సభలోనే ఉన్నారని, అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అన్నారు.

తెలంగాణ విషయంలో కాంగ్రెసు మోసం చేస్తోందని, సమస్యకు కూడా కాంగ్రెసు పార్టీ కారణమని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్‌కు తెలంగాణ సమస్య పట్టదని ఆయన విమర్శించారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెసుపై ఉందని ఆయన అన్నారు.

English summary
Lok Sabha speaker suspended Telangana Congress party MPs for four days from Parliament for their agitation on Telangana. Ponnam Prabhakar, Gutta Sukhendar Reddy, Rajaiah, Vivek, Manda Jagannadham, Balaram Naiak, Madhu Yashki and Komatireddy Rajagopal Reddy were suspended from house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X