రేణుకచౌదరి తెలంగాణ వ్యతిరేకి, బిజెపి వల్లే: టి-ఎంపీలు

రేణుకా చౌదరి తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చే విధంగా మాట్లాడుతున్నారని పొన్నం ప్రభాకర్ తదితర ఎంపీలు మండిపడ్డారు. తమను సస్పెండ్‌కు గురి చేసినప్పటికీ రేణుక తమకు మద్దతు ఇవ్వకపోవడం శోచనీయం అన్నారు. తెలంగాణ వ్యతిరేకించే వారు ఎవరైనా సీమాంధ్ర నాయకులేనని ఆయన అభివర్ణించారు. రేణుకను తెలంగాణ వ్యతిరేకిగా గుర్తిస్తున్నామన్నారు.
భారతీయ జనతా పార్టీ కుట్ర వల్లనే తమపై సస్పెన్షన్ వేటు పడిందని వారు ఆరోపించారు. లోకసభలో జరిగే విషయాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తెలియవని, మహబూబ్‌నగర్ గెలుపుతో ఆయన సొల్లు కబుర్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్రాల విభజన విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. బిజెపి నేత సుష్మా స్వరాజ్ సూచనల మేరకే తమను సస్పెండ్ చేశారన్నారు.
ఉప ఎన్నికలకు, తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధం లేదని అన్నారు. తమ సస్పెన్షన్ అంశాన్ని సీమాంధ్ర నేతలు ఉపయోగించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు వారు కె కేశవ రావు ఇంట్లో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్లమెంటు వద్ద కొనసాగించాల్సిన నిరసనపై చర్చించారు.
కాగా ఈ రోజు సాయంత్రం ఎంపీలు హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి వారు నేరుగా గన్ పార్కుకు చేరుకొని అక్కడ తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులపై రెండు రోజుల క్రితం నాలుగు రోజుల పాటు సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications