పిడుగుపాటుకు రాష్ట్రంలో 16 మంది మరణం

గుంటూరు, ఖమ్మం, ప్రకాశం, వరంగల్ జిల్లాలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గుంటూరులో జిల్లా అత్యధికంగా 11మంది మృతి చెందారు. ఖమ్మంజిల్లా ఇద్దరు మరణించగా, ప్రకాశం, వరంగల్ ఒక్కొక్కరు మృతి చెందారు.
గుంటూరు జిల్లాలో వర్షం కురడంతో పాటు పలు చోట్ల పిడుగులు పడ్డాయి. 11 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు పిడుగుల శబ్ధానికి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిపాలయ్యారు. జిల్లాలోని చిలకలూరిపేట పరిసర గ్రామాలలో పిడుగులు పడి ముగ్గురు మృతి చెందగా మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. గురజాల మండలంలోని తేలికుంట్ల గ్రామంలో మేకల కాపరి చింతల వెంగళయ్య (59), చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి గ్రామంలో మొక్కజొన్న పంటకు కూలీగా వెళ్లిన తల్లీకూతుళ్లు వరలక్ష్మీ (44), ఆదిలక్ష్మీ (26)లు అక్కడికక్కడే మృతి చెందారు.
గుంటూరు జిల్లాలో పిడుగు శబ్దానికి మరో ముగ్గురు క్షతగాత్రులై తెనాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమరావతి మండలంలోని లింగాపురం గ్రామంలో సరిపూడి వెంకటరాజ్యం (52)తో పాటు యడ్లపాడు మండలం ఉప్పరపాలెంకు చెందిన పల్లపు లక్ష్మమ్మ (52) మృతి చెందింది. పెదనందిపాడు అబ్బినేనిగుంటపాలెంకు చెందిన తలపుల శ్రీనివాసరావు (35), ఎస్.వెంకటేశ్వర్లు (38), చిలకలూరిపేట మండలం పసుమర్రులో అద్దంకి పార్వతి (25), చిన్నకొండ్రుపాడులో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా మరొకరు శబ్ధానికి క్షతగాత్రులయ్యారు.
అదే విధంగా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో మేకల కాపరి గైరబోయిన సీతారామయ్య (34) మృతి చెందాడు. గణపవరం వద్ద విజయసారధి విత్తనాల మిల్లులో పిడుగుపడి సుమారు రెండున్నర లక్షల నుంచి 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. అందుకు సంబంధించిన సరుకు మీద పరదాలు కప్పడానికి వెళ్లిన నేపథ్యంలో ఓ బీహార్ కార్మికుడు హీరాలాల్ (19) పిడుగుపడి మృతి చెందాడు. అదే విధంగా ఈ సంఘటనలో పశువులు మృతి చెందాయి. మృతి చెందిన కుటుంబాల రెక్కాడితేకాని డొక్కాడని కూలీలు కావడంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరువ్యక్తులు మరణించారు. కొణిజర్లమండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ఓగొర్రెలకాపరి,నఖమ్మంపట్టణం చెందిన నవీన్ (11) అనేబాలుడు పిడుగుపాటుతో మృతి చెందారు. ప్రకాశం జిల్లా జె.పంగులూరు మంలంలోని కల్లంవారిపాలెం గ్రామంలో ఆదివారం కురిసిన భారీ వర్షాల సందర్బంగా పిడుగుపడి గ్రామానికి చెందిన భవనం బుల్లిరెడ్డి (58) మృతిచెందారు. కడప జిల్లాలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మరణించాడు.
రాష్ట్రంలో ఆదివారంనాడు వివిధ జిల్లాలలో పిడుగుపాటుకు మృతి చెందినవారి కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయా పథకాల ద్వారా బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అదే విధంగా గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని సీఎం సూచించారు.












Click it and Unblock the Notifications