ఎయిర్ ఇండియా దారిలో రెండు టెలికం సంస్థలు

ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ 2005 - 2006లో 10,000 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2010 - 2001 నాటికి అది 6000 కోట్ల నికర నష్టాల్లో కూరుకుపోయింది. 2011 - 2012 ఆర్థిక సంవత్శరం ఫలితాలు వెలువడితే ఆ నష్టం మరింత ఉండవచ్చు. అయితే, ఇది ఎయిర్ ఇండియా నష్టాల కన్నా తక్కువే ఉండవచ్చు.
ఇక మహానగర్ టెలిఫోన్ నిగం లిమిటెడ్ (ఎంటిఎన్ఎల్) విషయానికి వస్తే ఢిల్లీ, ముంబై టెలికం సర్వీసు రంగంలో ఏకఛత్రాధిపత్యం వహించింది. దాని షేర్ విలువ రూ.370 పలికింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత దాని షేర్ విలువ 25 రూపాయలకు పడిపోయింది. వరుసగా నష్టాల పాలు అవుతుండడమే దానికి కారణం. నష్టం 2011 - 2012లో రూ. 4000 కోట్లకన్నా మించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
టెలికం పిఎస్‌యులు ఎంటిఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ నష్టాలు కలిసి ఎయిర్ ఇండియా నష్టాల కన్నా ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. మీడియా అంతా ఎయిర్ ఇండియా మీదనే దృష్టి కేంద్రీకరించింది. ఎయిర్ ఇండియాను మూసేయాలా అనే చర్చ కూడా సాగుతోంది. ఇదే విధమైన నష్టాల్లో కూరుకుపోతూ ఉంటే బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్‌లను కూడా మూసేయాల్సి వస్తుందా అనే చర్చ ముందుకు వస్తుంది. వాటి నష్టాలు అదుపు చేయలేని స్థితికి చేరుకోవచ్చునని అంటున్నారు.
పోటీ ప్రపంచంలో ఆ పోటీని తట్టుకుని నిలబడే సామర్థ్యం ఈ రెండు టెలికం సంస్థలకు కూడా లేదు. ప్రైవేట్ టెలికం సంస్థలు చాలా భారీ లాభాలను ఆర్జిస్తున్న సమయంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు ఈ స్థితికి చేరుకోవడం ఆశ్చర్యమే. ఎయిర్ ఇండియాతో పాటు ఈ రెండు టెలికం సంస్థలను కూడా పునర్వ్యస్థికరించాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications