జగన్ గజదొంగ: కొండ్రు, నెలరోజుల్లో అరెస్టన్న లగడపాటి

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలు అన్నీ కాంగ్రెసు పార్టీవేనని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో అన్నారు. పథకాలను జగన్ తన తండ్రి ప్రవేశ పెట్టిన పథకాలుగా చెప్పుకోవడం సరికాదన్నారు. ఉప ఎన్నికలు ఖచ్చితంగా రెఫరెండమే అని చెప్పారు. కేవలం కాంగ్రెసు పార్టీకే కాదని అన్ని పార్టీలకు అంతేనని చెప్పారు.
మేకపాటి సోదరులు కాంగ్రెసు గుండెల్లో గునపం దించి జగన్ పంచన చేరారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే వాడు అయితే జగన్ కొట్టే వాడని అన్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని అన్నారు. విశాఖపట్నం అభివృద్ధికి పాల్పడిన సుబ్బిరామి రెడ్డి ఎంతో కృషి చేశారని, అలాగే నెల్లూరు అభివృద్ధికి పాల్పడతారని చెప్పారు.
జగన్ తనకు తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరించే ధోరణిలో మాట్లాడటం జగన్‌కు సరికాదన్నారు. తాను ఈ నెల 23 తేది నుండి ప్రత్తిపాడు నుండి తిరుపతి వరకు ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని చెప్పారు. జగన్ నెల రోజల్లో అరెస్టవుతారన్నారు. జగన్ టిడిపి, టిఆర్ఎస్, బిజెపితో జగన్ కుమ్మక్కయ్యారన్నారు. జగన్ సంస్థలలో పెట్టుబడులు పెట్టిన వారు జైళ్లలో ఉండగా అతను మాత్రం బయట తిరుగుతున్నారన్నారు. అతని అరెస్టు ఖాయమన్నారు.
సుబ్బిరామి రెడ్డి అందరికీ సుపరిచితులని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెసు పార్టీ హయాంలోనే మైనార్టీలకు లబ్ధి చేకూరిందన్నారు. ముస్లింల రిజర్వేషన్లు ఖచ్చితంగా కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. సుబ్బిరామి రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్ వల్ల పారిశ్రామికవేత్తలు జైళ్లకు వెళుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications