జగన్ కన్నా తక్కువేం కాదు!: కెవిపి తనయుడిపై టిడిపి

వైయస్ సిఎం కాక ముందు కెవిపి తన పిల్లల చదువులకు ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారని, ఆయన కుమారులకు తానుసీట్లు ఇప్పించానని, ఇప్పుడు కెవిపి కుటుంబానికి దుబాయిలో వాణిజ్య భవనాలు, మనదేశంలో ఐదువేల మెగావాట్ల పవర్ ప్లాంట్లు ఉన్నాయని, ఐదేళ్లలో ఇంత సంపద ఎక్కడిది? వైయస్ హయాంలో ప్రతి వ్యవహారం కెవిపికి తెలిసే జరిగిందని, అయినా ఆయనను సిబిఐ ఎందుకు విచారించట్లేదని ముద్దు ప్రశ్నించారు.
వైయస్, కెవిపి అత్యాశ వల్లే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు దుర్భరమైన కరెంటు కోతను అనుభవిస్తున్నారని ఆయన విమర్శించారు. కొత్త విద్యుత్ ప్లాంట్లు కట్టడంలో జెన్‌కోకు విశేష అనుభవం, సామర్ధ్యం ఉన్నాయని, కానీ వైయస్ విటిపిఎస్ ఏడో దశ, భూపాలపల్లి ఐదో దశను బిజిఆర్ అనే కంపెనీకి ఇచ్చారని, ఇందులో కెవిపి కొడుకు బినామీ. అతడికి ఇంత పెద్ద విద్యుత్ ప్రాజెక్టులు కట్టే అనుభవం లేక వాటిని నాశనం చేసి వదిలిపెట్టాడన్నారు.
దీంతో అవి మాటిమాటికీ ట్రిప్పయి విద్యుత్తు కోతలతో ప్రజలు యాతనలు పడుతున్నారన్నారు. కెవిపి ఒక కేటుగాడని, ప్రస్తుతం సిబిఐ విచారణ జరుగుతోందని దాక్కొని దాక్కొని తిరుగుతున్నారని ముద్దు ఆరోపించారు. జగన్‌ను అరెస్టుచేసే సమయంలో కెవిపిని కూడా కలిపి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రులు క్యూ కట్టి సిబిఐ ముందు విచారణకు హాజరు కావడం ప్రొటోకాల్‌కే అవమానంగా మారిందని, ముందు వారు తమ పదవులను వదిలిపెట్టి తర్వాత విచారణకు హాజరు కావాలని ఆయన డిమాండ్ చేశారు.
జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ ఆదేశాలపై సంతకాలు చేస్తున్న హోంమంత్రి మరోపక్క తాను సిబిఐ విచారణకు హాజరు అవుతున్నారని, ఒకవేళ హోంమంత్రిని అరెస్టు చేస్తే రాష్ట్రం పరువు పోతుందని ముందే ఆమెతో రాజీనామా చేయిస్తే మంచిదని ముద్దు సూచించారు. కెవిపి, సూరీడు, సరసాదేవి వంటివారు అప్రూవర్లుగా మారి గతంలో జరిగిన వ్యవహారాలను బయటపెట్టాలని బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సూచించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!