వైయస్ చెప్పినందుకే చేసి ఉండొచ్చు: మోపిదేవిపై బొత్స

ఆయన అరెస్టు దురదృష్టకరమని, మోపిదేవి లేఖలో పేర్కొన్నదే జరిగి ఉండవచ్చునని ఆయన అన్నారు. మా నాయకుడు చెప్పినట్లుగానే ఆయన సంతకాలు చేసి ఉంటాడని తాను నమ్ముతున్నానని అన్నారు. మోపిదేవి చెప్పేందే వాస్తవం అవుతుంది కదా అన్నారు. సౌమ్యుడు, ఎప్పుడూ మాట జవదాటని వ్యక్తి అయిన మో పిదేవి వెంకటరమణను సిబిఐ కస్టడీలోకి తీసుకోవడం దురదృష్టకరమని పలువురు మంత్రులు కూడా అభిప్రాయపడ్డారు. పార్టీకి, నాయకత్వానికి మోపిదేవి చాలా విశ్వాసపాత్రుడని, ఆయన తప్పకుండా బయటకు వస్తారని విశ్వసిస్తున్నామని బొత్స సత్యనారాయణ అన్నారు.
ఆయనపై ఏ ఆరోపణా లేకుండా బయటకు వస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు. ఇలా జరిగినందుకు తామంతా బాధపడుతున్నామని, అధిష్ఠానం దృష్టికి వాస్తవాలను తీసుకువెళ్తామని తెలిపారు. మోపిదేవి ఏ పొరపాటూ చేయలేదని తాము నమ్ముతూ.. ఆయనకు సంఘీభావం తెలుపుతున్నామని మరోమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నాటి సిఎం వైయస్ ఆదేశాల మేరకే సంతకాలు చేసినట్లు చెప్పారని, వ్యక్తిగతంగా వీటివల్ల ఆయన ఎలాంటి లబ్ధి పొందలేదని చెప్పారు.
పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాల్లోనూ రాయితీలు ఇవ్వడం వల్లే పరిశ్రమలు పెడుతున్నారని, ఇందులో తప్పేమీ లేదని ఆయన అన్నారు. త్వరలో మరో ఐదుగురు మంత్రులు అరెస్టవుతారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఉత్తమ్ చెప్పా రు. అసలు మోపిదేవిని అరెస్టు చేయలేదని, సీబీఐ కేవలం దర్యాప్తు కోసమే ఆయనను కస్టడీలోకి తీసుకుందని, ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
మోపిదేవి నిర్దోషి అని.. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. వాస్తవాలపై విచారణ జరపాలని ఆయనే కోరారని, కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉందనడానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. మోపిదేవి అరెస్టు ప్రభావం ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలపై ఉండబోదని విశ్వాసం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications