జగన్ కంపెనీలకు వచ్చిన పెట్టుబడులు లంచాలే

రిమాండ్ రిపోర్టులో వైయస్ రాజశేఖర రెడ్డి పేరును సిబిఐ పలు చోట్ల ప్రస్తావించింది. ఏయే సంస్థలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి, వాటికి వైయస్ ప్రభుత్వం నుంచి ఏయే రూపాల్లో ప్రయోజనం కలిగిందనే విషయాలను సిబిఐ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా వివరించింది. జగతి పబ్లికేషన్స్ వాటాలను ఒక్కోదాన్ని 350 రూపాయల చొప్పున లెక్క వేసి వసూలు చేశారని చెప్పింది. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ వాన్‌పిక్‌కు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూముల వివరాలను, నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడుల వివరాలను సిబిఐ చెప్పింది.
జగతి పబ్లికేషన్స్ స్థాపనకు అయ్యే ఖర్చును కూడా జగన్ దాచి పెట్టారని, రెండేళ్లు సాక్షి నష్టాల్లో ఉన్నా భారీగా పెట్టుడులు వచ్చాయని, సాక్షి లాభాల్లో వాటాలను గానీ షేర్లను గానీ వెనక్కి తీసుకునే అవకాశం కల్పించలేదని సిబిఐ తెలిపింది. కోల్‌కత్తా, ముంబైలకు చెందిన బ్రీఫ్ కేసు కంపెనీల నుంచి జగన్ సంస్థల్లోకి వంద కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, అవి ఎక్కుడున్నాయో కూడా కూడా తెలియదని సిబిఐ తెలిపింది. జగన్ విదేశాలకు డబ్బులు తరలించి, అక్కడి నుంచి సండూర్ పవర్ కంపెనీలోకి మళ్లించి, దాని ద్వారా జగతిలోకి పెట్టుబడులను మళ్లించారని ఆరోపించింది. మారిషిస్‌కు చెందిన రెండు కంపెనీల నుంచి 120 కోట్ల రూపాయలు జగన్ కంపెనీల్లోకి వచ్చాయని చెప్పింది.
దాల్మియా, పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, తదితర సంస్థల వ్యవహారాలను సిబిఐ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా తెలిపింది. ఇండియా సిమెంట్స్ జగతిలో 40 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిందని చెప్పింది. దాల్మియా సిమెంట్స్ 90 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని తెలిపింది. అందుకు ఆ కంపెనీలు వైయస్ ప్రభుత్వం నుంచి పొందిన ప్రతిఫలాలను కూడా సిబిఐ వివరించింది. ఈ వివరాలన్నీ రాబట్టాల్సి ఉందని సిబిఐ తెలిపింది. జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చిన తీరుపై జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డికి పూర్తిగా తెలుసునని సిబిఐ తెలిపింది. పెట్టుబడిదారులను జగన్ మోసం చేశారని సిబిఐ ఆరోపించింది.












Click it and Unblock the Notifications