జగన్‌కు ఊరట: ఎల్లుండి నుంచి ప్రచారంలోకి విజయమ్మ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఫ్యాన్ గుర్తును కేటాయిస్తూ ఈసి నిర్ణయం తీసుకుంది. గతంలో కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఈసి ఫ్యాన్ గుర్తు కేటాయించింది. కడప లోకసభ నియోజకవర్గం నుంచి వైయస్ జగన్, పులివెందుల శాసనసభా స్థానం నుంచి వైయస్ విజయమ్మ అప్పట్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు.
కాగా, తన కుమారుడు వైయస్ జగన్ అరెస్టుకు నిరసనగా వైయస్ విజయమ్మ చేపట్టిన దీక్షను విరమించారు. ఆమెకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఆమె ఎల్లుండి గురువారం నుంచి ఉప ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి ఆమె తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచే వైయస్ జగన్ తన చివరి ప్రచారాన్ని సాగించి, సిబిఐ విచారణ నిమిత్తం హైదరాబాదు వచ్చారు. దాంతో ఆమె అక్కడి నుంచే తన ప్రచారాన్ని ప్రారంభించాలని భావించినట్లు చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వైయస్ విజయమ్మకు నచ్చజెప్పడానికి తీవ్రంగా ప్రయత్నించారు. జగన్ అరెస్టుకు కుట్ర చేసిన కాంగ్రెసుకు బుద్ధి చెప్పాలంటే ప్రచారంలోకి దిగక తప్పదని వారు విజయమ్మకు నచ్చజెప్పారు. దాంతో ఆమె అందుకు అంగీకరించారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉందని విజయమ్మ అన్నారు. ప్రజలే న్యాయనిర్ణేతలని, తాను ప్రజల వద్దకే వెళ్తానని ఆమె అన్నారు. వైయస్ జగన్ ఏ తప్పూ చేయలేదని, నిజం నిలకడ మీద తెలుస్తుందని, నిర్దోషిగా జగన్ బయటకు వస్తారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications