భాను కిరణ్‌కు ఆయుధాలు అందించా: మంగలి కృష్ణ

భానుతో పాటు సూరి సోదరి హేమలతా రెడ్డి, డ్రైవర్ మధుమోహన్ రెడ్డి, న్యాయవాది ఈడిగ శ్రీకాంత్ గౌడ్‌తో కలిసి పలువురిని బెదిరించి సెటిల్‌మెంట్లు చేసినట్లు అంగీకరించాడని సమాచారం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం నైలట గ్రామంలో రూ. 2 కోట్ల విలువైన 3.27 ఎకరాల భూమి, అదే గ్రామంలో రూ.10 కోట్ల విలువచేసే 19.32 ఎకరాల భూమిని 2006లో అక్రమంగా స్వాధీనం చేసుకున్నామని కృష్ణ దర్యాప్తు అధికారుల ముందు అంగీకరించారు. అయితే, భాను వెల్లడించని మరిన్ని సెటిల్‌మెంట్లను, భానుకు ఉన్న ఆస్తుల వివరాలను కృష్ణ సిఐడి అధికారులకు చెప్పినట్లు తెలిసింది.
తుక్కుగూడలో రూ.15 కోట్ల విలువ చేసే 15 ఎకరాల భూమి, కరీంనగర్ జిల్లా ధర్మారంలో కోటి రూపాయల విలువైన 6 ఎకరాల భూమిని భాను, సూరి, జంబుల శ్రీకాంత్‌రెడ్డి కలిసి ఆక్రమించుకున్నారని, కానీ అందులో తనకు వాటాలేదని కృష్ణ చెప్పారు. మహేశ్వరం మండలంలోని పెండ్యాల గ్రామంలో సుధీర్‌రెడ్డి అనేవ్యక్తిని బెదిరించి భాను, సూరి, మధుమోహన్, నిమ్స్ వైద్యుడు శరత్ నాగ ప్రసాద్ రూ. 6 కోట్ల విలువ చేసే 5.27ఎకరాల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని తెలిపినట్లు సమాచారం.
ఆయుధాల విషయంలో మరింత సమాచారాన్ని సేకరించే పనిలో దర్యాప్తు అధికారులు ఉన్నారు. విశాఖపట్నంలో సూరి పేరు చెప్పి కొన్నాళ్లు సెటిల్‌మెంట్లు చేసిన భానుకిరణ్ సమీప బంధువు ఒకరికి కృష్ణ ఆయుధాలు సరఫరా చేసినట్లు సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. విశాఖలో ఇటీవల గన్‌కల్చర్ పెరగడంతో ఇంకా ఎవరికైనా కృష్ణ ఆయుధాలు సరఫరా చేశాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల్లో కృష్ణ సీఐడీ కస్టడీ ముగియనుంది.












Click it and Unblock the Notifications