ప్రచారంలో కన్నీటిపర్యంతమైన విజయమ్మ, షర్మిళ ప్రశ్న

YS Vijayamma-Sharmila
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ గురువారం తన ప్రచారంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె తన కూతురు షర్మిళతో పాటు పాయకరావుపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రచారానికి వచ్చే ముందు తాను జైలులో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చానని, జగన్ చాలా ధైర్యంగా, నమ్మకంగా ఉన్నాడని, తాను ఏ తప్పు చేయలేదని తనతో చెప్పాడని అన్నారు. ధైర్యంగా ఉండమని తనకూ చెప్పాడన్నారు.

ఉప ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించాలని చెప్పాలని తనకు సూచించాడన్నారు. జగన్ పైన మీరందరూ చూపిస్తున్న అభిమానానికి ఏం ఇచ్చి రుణం తీర్చుకోవాలన్నారు. వైయస్ కాంగ్రెసును కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వచ్చి, ప్రజల కోసం పథకాలు ప్రవేశపెడితే ఇప్పుడు ఆయనను దోషిగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందన్నారు. ప్రజలకు పథకాలు అందాలన్న ఉద్దేశ్యంతోనే వైయస్ రచ్చబండ కార్యక్రమం చేపట్టారన్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. సిబిఐ విచారణ సజావుగా సాగిందని తాను భావించడం లేదన్నారు.

నా కన్నీటి బొట్టు చూస్తుంటే నిజంగా కుట్ర జరిగిందని అనిపించడం లేదా అని ప్రశ్నించారు. హెలికాప్టర్ ప్రమాదంపై జగన్‌ను అప్పుడే ఏడుస్తూ అడిగానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటేనే నిజం బయటపడుతుందని తనకు ఆ రోజే సమాధానం ఇచ్చాడని ఆమె చెప్పారు. అనుమానం ఇప్పుడు వచ్చింది కాదన్నారు. వైయస్‌ను రోల్ మోడల్‌గా చూపించిన వారు ఇప్పుడు ఆయనను దోషిగా చిత్రీకరించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారన్నారు.

జగన్ విషయంలోనూ అదే తరహా కుట్ర జరుగుతోందన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసులు కలిసి వైయస్ కుటుంబాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. వైయస్ సిఎంగా ఉండగా జగన్ ఏనాడైనా క్యాంప్ ఆఫీసులో కనిపించాడా, మంత్రులతో మాట్లాడారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఏ తప్పు చేయనప్పుడు దోషిగా నిలబెట్టి ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. తొమ్మిది నెలలుగా విచారణ జరుగుతోందని, సిబిఐకి ఇప్పుడు ఏం ఆధారం దొరికిందని ఉప ఎన్నికలకు ముందు జైలుకు పంపిందన్నారు.

జగన్ చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తి అన్నారు. తనకు రాజకీయాలు తెలియవని, ఏ రోజూ తాను బయటకు రాలేదని చెప్పారు. ఈ ఉప ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్నవన్నారు. తన కడుపు బాధ, మీ గుండెల్లో ఆవేదన, వైయస్ మరణం, జగన్ అరెస్టును గుర్తించి ప్రజలు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో అందరూ చూస్తున్నారన్నారు. అభ్యర్థులను ఎవరూ ఊహించని మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు.

తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలుకు పంపించారని షర్మిళ ఆరోపించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి వైయస్ రాజశేఖర రెడ్డిని దోషిగా నిలబెట్టే కుట్ర చేస్తున్నాయన్నారు. అందులో భాగంగానే జగన్‌ను కటకటాల వెనక్కి పంపించారన్నారు. మూడేళ్లుగా జగన్‌ను మీరు చూస్తున్నారని, నిరంతరం మీ మధ్యే ఉంటున్నారని, మీతో మమేకమయ్యే ప్రయత్నం చేశారని, మీ సమస్యను తన సమస్యగా జగన్ భావించారని, అందుకే అతనిని జైలుకు పంపించారన్నారు.

జగన్‌ను కటకటాల వెనక్కి కాంగ్రెసు ఎందుకు పంపించిందని, అతనంటే వారికి భయమా అని ప్రశ్నించారు. రాజకీయాలు ఎంతగా దిగజారాయో ఆలోచించాలని ఆమె ప్రజలకు సూచించారు. రాజకీయ వ్యవస్థ మారాలని, నీచ రాజకీయాల నుండి అందరం బయటకు రావాలన్నారు. కుట్ర రాజకీయాలు వద్దని ఓట్లతో కాంగ్రెసు, టిడిపిలకు బుద్ధి చెప్పాలని ఆమె సూచించారు. కుట్ర రాజకీయాలకు ఉప ఎన్నికలలో బుద్ధి చెప్పాలన్నారు.

జగన్ మీ మనిషి అని, మీ కోసం పోరాటం చేసినందుకే అతనిని జైలుకు పంపించారన్నారు. ఈ అన్యాయం ఇక సాగనివ్వవద్దన్నారు. రాజన్న రాజ్యం రావాలన్నా, జగన్‌ను సిఎం చేయాలన్నా ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. హెలికాప్టర్‌ను కూల్చి, మంచి మనిషిని జైలుకు పంపించే స్వార్థ రాజకీయాలు మనకొద్దన్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేసి బాబూరావును గెలిపించాలన్నారు. ప్రతి ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల మొహంలో సంతోషం చూడాలని వైయస్ అనుకున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+