ఉప్పు అనుకుని సర్ఫ్ పౌడర్ వడ్డింపు.. 40 మంది పిల్లలకు అస్వస్థత!
బీహార్లోని నలంద జిల్లాలో ఘోర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. నూర్ సరాయ్ పీఎస్ పరిధిలోని పరసి మిడిల్ స్కూలులో మధ్యాహ్నభోజన సమయంలో ఉప్పుకు బదులుగా పొరపాటున డిటర్జెంట్ పౌడర్(సర్ఫ్) వడ్డించడంతో దాదాపు 40 మంది విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉప్పు అని పొరపడి కూరలో సర్ఫ్ కలపడమే ఈ దారుణానికి కారణమని తేలింది. ఈ వార్త తెలియడంతో స్థానికంగా, విద్యార్థుల తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన నెలకొంది.
అసలేం జరిగిందంటే?
పాఠశాల ఉపాధ్యాయులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పరసి మిడిల్ స్కూల్‌కు మధ్యాహ్న భోజనం మరో పాఠశాల లేదా కేంద్రీకృత వంటగది నుంచి సరఫరా చేయబడింది. విద్యార్థులకు వడ్డించిన సోయాబీన్ కూరలో ఉప్పు తక్కువగా ఉండటంతో కొంత మంది విద్యార్థులు ఉప్పు కావాలని అడిగారు. అయితే ఉప్పు డబ్బాకు బదులుగా పొరపాటున సర్ఫ్ పౌడర్ ను వడ్డించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని గమనించని విద్యార్థులు ఆ ఆహారాన్ని తిన్న కొద్దిసేపటికే కడుపునొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బంది పడ్డారు.

విద్యార్థులను ఆస్పత్రికి తరలింపు
ఒక్కొక్కరిగా దాదాపు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై చిన్నారులను బీహార్ షరీఫ్ మోడల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకోవడంతో ఆందోళన వాతావరణం నెలకొంది. నలంద సివిల్ సర్జన్ డాక్టర్ జై ప్రకాష్ సింగ్ ఆధ్వర్యంలో పలువురు వైద్యులు చిన్నారులకు తక్షణమే చికిత్స అందించారు. ప్రస్తుతం పిల్లలందరూ సురక్షితంగా ఉన్నారని.. నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సివిల్ సర్జన్ వెల్లడించారు.
బాధితులను పరామర్శించిన మంత్రి
ఈ ఘటనపై సమాచారం అందుకోగానే బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో ఇలాంటి ఘోర నిర్లక్ష్యం వహించడం సహించరానిదని..బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
విచారణకు ఆదేశించిన అధికారులు
ఆహార పదార్థాలు భద్రపరిచే చోట డిటెర్జెంట్ పౌడర్(సర్ఫ్) ఎలా ఉంచారు? వడ్డించే సమయంలో కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అనే కోణంలో అధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. మధ్యాహ్నం భోజనం సరఫరా చేసే వ్యవస్థలోని లోపాలను గుర్తించి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యా శాఖ, జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నాయి.
क्या मजाक चल रहा है? नमक की जगह मिड डे मील में सर्फ पड़ने से छात्राओं की तबीयत बिगड़ गई है....नालंदा के नूरसराय थाना क्षेत्र स्थित परासी मिडिल स्कूल की ये घटना है....कभी सांप,कभी छिपकली,कभी सड़ा हुआ अंडा.....अरे बच्चे बिहार के हैं... बिहार के लोगों के टैक्स के पैसों से बना मिड डे… pic.twitter.com/uTCYbzGDWu
— Garima Bharti (@GarimaBharti19) August 18, 2026













Click it and Unblock the Notifications