హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలికి షాక్: బ్రాహ్మణి స్టీల్స్ ఒప్పందం రద్దు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన బ్రహ్మణి స్టీల్‌ప్లాంట్‌తో అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి టీఎస్ అప్పారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు వద్ద స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు బ్రహ్మణి ఇండస్ట్రీస్‌తో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో 2007 మే 21న పరిశ్రమల శాఖ ఒప్పందం చేసుకుంది.

20 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతామని, 2017 నాటికి తమ ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యం కోటి టన్నులకు చేరుతుందని బ్రాహ్మణి అప్పట్లో తెలిపింది. ఈ ప్లాంటుద్వారా పది వేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపింది. ప్రతిపాదిత యూనిట్‌కు రాయితీలు, ప్రోత్సాహకాలు కోరింది. ఈ ప్రతిపాదనలను 2007 మే 21న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) భేటీలో ఆమోదించగా ప్రభుత్వం జీవో 477 జారీచేసింది.

తర్వాత ప్రాజెక్టుకు 10,760.66 ఎకరాలను కేటాయిస్తూ రెవెన్యూశాఖ నిర్ణయం తీసుకుంది. ఎకరా రూ.18 వేల చొప్పున ఈ భూ కేటాయింపులు చేశారు. అలాగే జమ్మలమడుగు మండలం అంబవరంవద్ద వాణిజ్య విమానాశ్రయం ఏర్పాటుకు మరో 3115 ఎకరాలు కేటాయించింది. ఈ భూమి ధరను ఎకరా రూ.25వేలుగా నిర్ణయించింది. బ్రహ్మణి స్టీల్స్ కోసం గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని కేటాయిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2005-10 పారిశ్రామిక విధానం ప్రకారం బ్రహ్మణి ఇండస్ట్రీస్‌కు రాయితీలు ఇవ్వాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది.

అలాగే కేంద్ర ప్రభుత్వ, ఇతర అనుమతులు పొందడానికి బ్రహ్మణి ఇండస్ట్రీస్‌కు సహకరించాలని తీర్మానించింది. వాస్తవానికి, ఒప్పందం ప్రకారం 2009 నాటికి 20 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో తొలిదశ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. ఏడాదిన్నర దాటిపోయినా ప్రాజెక్టు బ్రహ్మణి ఇండస్ట్రీస్ దాన్ని అమలు చేయలేకపోయింది. దీనికితోడు స్టీల్ ప్లాంట్‌కు కేటాయించిన 10760 ఎకరాల భూములను యాక్సిస్ బ్యాంకులో తాకట్టుపెట్టి రూ.350కోట్ల రుణం పొందింది. దీనిపై కడప జిల్లా కలెక్టర్ జమ్మలమడుగు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

ప్రాజెక్టు ఇన్‌చార్జి పి.రంగారెడ్డిపై 2012 మార్చి 22న చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మణి ఇండస్ట్రీస్‌కు పరిశ్రమల శాఖ పలుమార్లు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఒప్పందాన్ని, భూ కేటాయింపులను ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. దీంతో తమ మాతృ సంస్థ అయిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కార్యకలాపాలను నిలిపివేశారని, అందుకే తాము స్టీల్ ప్లాంట్ పనులను నిలిపి వేశామని 2011 మార్చి ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి బ్రహ్మణి ఇండస్ట్రీస్ లేఖ రాసింది.

స్టీల్ ప్లాంట్‌పై తాము ఇప్పటివరకు రూ.1350 కోట్ల పెట్టుబడి పెట్టామని, తొలి దశ ప్రాజెక్టుకు అమలుకు సంబంధించి పలు పనులు పూర్తి చేశామని తెలిపింది. ఓఎంసీ ద్వారా వచ్చిన సొంత నిధులనే ప్రాజెక్టుపై పెట్టుబడి పెట్టామని, ఓఎంసీపై సీబీఐ విచారణకు ఆదేశించిన తర్వాత బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడానికి ముందుకు రాకపోవడం కూడా ప్రాజెక్టు అమలు చేయకపోవడానికి కారణమని వివరించింది.

గండికోట రిజర్వాయరు నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. ప్రభుత్వ షోకాజ్ నోటీసుకు స్పందనగా బ్రహ్మణి ఇండస్ట్రీస్ ఇచ్చిన సుదీర్ఘ సమాధానాన్ని ప్రభుత్వం న్యాయ శాఖ పరిశీలనకు పంపింది. పరిశ్రమల శాఖ దీనిపై రెవెన్యూ, సాగునీటి శాఖల అభిప్రాయాలు తీసుకుంది. కడప జిల్లా కలెక్టర్ బ్రహ్మణి ఇండస్ట్రీస్‌కు కేటాయించిన భూమిని పరిశీలించి భూ వినియోగ వివరాలను అందజేశారు.

ప్లాంటుపై రూ.1350 కోట్లు ఖర్చు చేశామని బ్రహ్మణి ఇండస్ట్రీస్ చెబుతుండగా, అక్కడ కేవలం రూ.171 కోట్లు ఖర్చు చేసి ఉంటారని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, ఆర్అండ్‌బీ ఇంజనీర్లు తేల్చారు. ప్రాజెక్టు అమలు, ఉపాధి కల్పనతోపాటు అన్ని విధాలుగా బ్రహ్మణి ఇండస్ట్రీస్ విఫలం కావడంతో చర్యలకు న్యాయశాఖ సిఫారసు చేసింది. ప్రాజెక్టు అమల్లో విఫలమైనందుకు బ్రహ్మణితో ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

English summary
CM Kiran kumar Reddy's government has cancelled NOU with Karnatala former minister Gali Janardhan Reddy's Brahmani steels. According to MOU Brahmani steels has failed to implement the project within stipulated time in Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X