వైయస్ మృతిపై బొత్స వ్యాఖ్య ఎదురు తిరుగుతుందా?

వైయస్ విజయమ్మ విమర్శను తిప్పికొట్టడానికి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి వైయస్ విజయమ్మ, వైయస్ జగన్ కుట్ర చేసి ఉంటారనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్య ప్రజలకు మింగుడు పడడం కష్టమేనని అంటున్నారు. వైయస్ విజయమ్మ పట్ల ప్రజల సానుభూతి బొత్స వ్యాఖ్యల వల్ల మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
పార్టీ అధిష్టానాన్ని సంతోషపెట్టే ఉద్దేశంతో బొత్స సత్యనారాయణ అత్యుత్సాహంతో ఆ ప్రకటన చేశారనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. ఎంతటి దుర్మార్గులైనా భార్య భర్తను, కుమారుడు తండ్రిని చంపుకుంటారా అనే ప్రశ్న బొత్స వ్యాఖ్యలపై ఉదయిస్తోంది. బొత్స వ్యాఖ్య వల్ల పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని కాంగ్రెసు నాయకుడొకరు అన్నారు.
బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఓ దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఆ పత్రిక వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా నిరంతరం రాస్తూనే ఉంటుందనే అభిప్రాయం ఉంది. దీనివల్ల కాంగ్రెసు పార్టీకి నష్టమే గానీ ఒనగూరే అదనపు ప్రయోజనం లేదని అంటున్నారు. వైయస్ విజయమ్మ చేసిన వ్యాఖ్యలను ఖండించడం వేరు, బొత్స సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు వేరని అంటున్నారు.
వైయస్ విజయమ్మ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి దాటిగానే ప్రతిస్పందించారు. వారు చేసిన వ్యాఖ్యలకు హేతుబద్దత ఉంది. కానీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయని అంటున్నారు. వైయస్ విజయమ్మ, ఆమె కూతురు షర్మిల ఉప ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి ఆదరణ లభిస్తున్న స్థితిలో వారిని ఎదుర్కునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వైయస్ జగన్‌ను ఉతికి ఆరేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా బొత్స చేసినంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయలేదు. వైయస్ విజయమ్మ పెంపకం బాగా లేదని, వైయస్ జగన్ చెడిపోయాడని, దారిలో పెట్టాల్సిన తల్లి చెడగొడుతోందని చంద్రబాబు అన్నారు. ఏమైనా, బొత్స సత్యనారాయణ అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని అంటున్నారు.












Click it and Unblock the Notifications