గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను ఎందుకు అరెస్టు చేశారు?: వైయస్ విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
గుంటూరు: తాను తన భర్తను పోగొట్టుకొని, తన తనయుడిని జైలులో పెట్టించుకొని న్యాయం కోసం మీ ముందుకు వచ్చానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఆదివారం అన్నారు. ఆమె గుంటూరు జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇంత ఎండలో మా కోసం వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు అన్నారు.

గుంటూరు జిల్లా ప్రజలు మంచివారని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు తనకు చెప్పే వారని, వారు చైతన్యవంతులని అన్నారు.. మీరు ఆలోచించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటు వేయాలని కోరారు. వైయస్ పాదయాత్ర చేసినప్పుడు గుంటూరువాసులు బ్రహ్మరథం పట్టారన్నారు. ఇప్పుడు తమనూ బాగా ఆదరిస్తున్నారన్నారు. తాను ప్రచారానికి వచ్చే ముందు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో కలిసి వచ్చానని చెప్పారు.

తాను ఏ తప్పు చేయలేదని, తాను ధైర్యంగా ఉన్నానని, ప్రజలను కూడా ధైర్యంగా ఉండమని చెప్పమని తనతో చెప్పారన్నారు. దేవుడు గొప్పవాడని, నిజం నిలకడ మీద తెలుస్తుందని తనతో చెప్పారన్నారు. వైయస్ ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేపట్టి రాష్ట్ర, కేంద్రాలలో కాంగ్రెసును అధికారంలోకి తెచ్చారన్నారు. ప్రజల కష్టసుఖాలు బాగా తెలిసిన వ్యక్తి అన్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు అవినీతిపరుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

వైయస్ లేని లోటు ఇప్పుడు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైయస్ ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. ఆ పథకాలు కాంగ్రెసువని ఇప్పుడు ప్రభుత్వం అంటోందని, అదే నిజమైతే మిగతా కాంగ్రెసు పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఆ పథకాలు లేవని ప్రశ్నించారు. జగన్ ఏ లబ్ధి పొందారని ఆమె ప్రశ్నించారు. వైయస్‌ను అవినీతిపరుడిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌కు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదన్నారు, అలాంటప్పుడు అతనెలా లబ్ధి పొందగలడన్నారు.

వైయస్ ముఖ్యమంత్రి కాకముందే జగన్‌కు చాలా ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. సాండూరు ప్రాజెక్టు తదితరాలు ఎన్నో 2004కు ముందే ఉన్నాయన్నారు. వైయస్ సిఎం అయ్యాక ఏ ఒక్కటీ రాలేదన్నారు. నిత్యం లక్ష కోట్లు అని ఆరోపణలు చేస్తున్నారని, ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ చేశారు. వైయస్‌ను రోల్ మోడల్ అన్న వారే ఇప్పుడు అవినీతిపరుడంటున్నారన్నారు. జగన్ చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి విచారణకు హాజరయ్యారని, కోర్టుకు కూడా హాజరయ్యేందుకు సిద్ధపడ్డారని, అడిగిన వాటికి సమాధానం చెప్పారన్నారు.

వైయస్ మరణం వెనుక అనుమానాలు ఉన్నాయని తాను చెప్పానే గానీ, పలావా వారు ఉన్నారని తాను చెప్పలేదన్నారు. అధికార దాహంతో జగన్, తాను కలిసి వైయస్‌ను హత్య చేశారని విడ్డూరంగా మాట్లాడుతున్నారు, వైయస్ అధికారంలో ఉంటే మేం అధికారంలో ఉన్నట్లు కాదా అలాంటప్పుడు అతనిని చంపే అవసరం మాకు ఎందుకుంటుందని ఆమె ప్రశ్నించారు. అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, మమ్మల్ని ఈ మాటలతో బాధ పెడుతున్నారన్నారు. ఇవన్నీ చెప్పుకునేందుకే మీ వద్దకు వచ్చానన్నారు.

వైయస్ చనిపోయినప్పుడే ఆయన మృతి తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదార్చుతానని జగన్ అప్పుడే ప్రకటించారన్నారు. ఓదార్పు నిర్వహించడమే తప్పయిందన్నారు. పార్టీ జెండాలోనే జగన్ సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. దేవుడి దయ వల్ల జగన్ బయటకు వస్తారని, అధికారంలోకి వస్తారన్నారు. టిడిపి, కాంగ్రెసు తాము ప్రజలకు ఏం చేస్తామో చెప్పడం లేదని వైయస్, జగన్‌ను టార్గెట్‌గా చేసుకున్నాయన్నారు.

జగన్‌ను అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. ఎందుకు అరెస్టు చేశారంటూ తాను దిల్ కుషా అతిథి గృహం ముందు కూర్చొని అధికారులను ప్రశ్నించానని, కానీ వారు ఏ కారణం చూపించలేక పోయారన్నారు. తనకు ప్రజలు మాత్రమే న్యాయం చేయగలరని భావించి మీ మధ్యకు వచ్చానని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు గుర్తు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తెలుగుదేశం, కాంగ్రెసు నేతల వాహనాలు తనిఖీలు చేయడం లేదని, కానీ తమ సూటుకేసులతో సహా తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు.

English summary
Honorary president of YSR Congress and Pulivendula MLA YS Vijayamma alleged that party president YS Jaganmohan Reddy had been arrested intentionally by the CBI, though the judge had stated that Jagan was not to be arrested. Speaking at roadshows in Guntur, as part of the election campaign for party candidate Ramakrishna Reddy, she said Jagan had been arrested for no rhyme or reason.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X