హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆళ్లనాని, సుజయరంగారావు రాజీనామా: జగన్ గూటికి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Alla Nani and Sujaya resigned
హైదరాబాద్: ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నాని, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగా రావు సోమవారం తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. వారు స్పీకర్ ఫార్మాట్‌లో సభాపతి నాదెండ్ల మనోహర్‌కు తమ రాజీనామాలు సమర్పించారు. రాజీనామా ఇవ్వడం కోసం వారు స్పీకర్ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరీక్షించారు. అనంతరం నాదెండ్ల వచ్చాక అతనికి రాజీనామాలు సమర్పించారు. రాజీనామా పత్రంలో ఏం చెప్పారో తెలియరాలేదు.

రాజీనామాలు సమర్పించిన ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగా రావులకు స్పీకర్ వాటిని ఉపసంహరించుకోవాల్సింది చెప్పినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో గత ఆరేళ్లుగా పదే పదే ఉప ఎన్నికలు వస్తున్నాయని, ఈ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన వారికి నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. పలుమార్లు ఉప ఎన్నికలు వస్తున్న కారణంగా ప్రజాప్రతినిధులు అనుకున్న స్థాయిలో ప్రజలకు సేవ చేయలేక పోతున్నారని, దీనిపై ఆలోచించాలని వారిని కోరారు.

వరుసగా రాజీనామాలు ఏ స్పీకర్‌ను ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టి ఉండక పోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా స్పీకర్‌గా ఏడాదికాలం పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. తనకు ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తున్నారన్నారు. ప్రభుత్వం పని తీరు మెరుగుపర్చేందుకు తన ప్రయత్నం తాను చేశానని అన్నారు. ఎమ్మెల్యే రాజీనామాలతో ప్రజాసేవకు ఇబ్బంది అన్నారు. పారదర్శకత కోసం త్వరలో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగా రావు ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గరయిన విషయం తెలిసిందే. గత నెల సిబిఐ అధికారులు జగన్‌ను విచారణకు తీసుకు వెళ్లిన సమయంలో వీరు ఆయనను కలిశారు. అనంతరం తాము కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. వారు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. త్వరలో వారు జగన్ పార్టీలో చేరనున్నారు.

రాజీనామా అనంతరం వారు శాసనసభ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. వైయస్ కుటుంబంపై వేధింపులు చూడలేకే తాము రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. జగన్ అరెస్టు అక్రమమని తాము భావిస్తున్నామన్నారు. కాంగ్రెసులో ఈ రోజు విజయమ్మ కన్నీటిని కూడా అపహాస్యం చేసే పరిస్థితి ఉందన్నారు. ఇతర ఎమ్మెల్యేల గురించి తమకు తెలియదని, తమ పరిధిలో ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నామన్నారు.

తాము వైయస్సార్ కాంగ్రెసులో చేరుతున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికల తర్వాత రాజకీయంగా రాష్ట్రంలో కీలకమార్పులు వచ్చే అవకాశముందన్నారు. తమకు పదవులే కావాలనుకుంటే పార్టీలోనే కొనసాగే వాళ్లమన్నారు. తమకు అలాంటి ఆలోచనే ఉంటే జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరతామా అని ప్రశ్నించారు. నైతిక విలువలకు కట్టుబడి తాము రాజీనామా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

English summary
Eluru MLA Alla Nani and Bobbili MLA Sujaya Krishna Ranga Rao resigned for their posts on monday afternoon. They are ready to join in Kadapa MP YS Jaganmohan Reddy's YSR Congress party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X