మీ ఊర్లోనే పోస్టాఫీసు బిజినెస్: పోస్టాఫీసుతో చేతులు కలపండి!
ప్రైవేట్ కొరియర్ సంస్థల స్పీడుకు అడ్డుకట్ట వేస్తూ.. ఈ-కామర్స్ మార్కెట్‌లో తన పట్టును మరింత బలపరుచుకోవడానికి భారత తపాలాశాఖ సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సరికొత్తగా 'ఫ్రాంచైజీ స్కీమ్ 2.0'ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. ఆధునిక కాలానికి తగ్గట్లుగా, సరికొత్త అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీ (APT 2.0) ఆధారంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. దీని ద్వారా గ్రామాలు, పట్టణాల్లోని నిరుద్యోగ యువత, చిరుద్యోగులు, స్వయం ఉపాధి కోరుకునే మహిళలు, చిన్న వ్యాపారస్తులు పోస్టాఫీసు భాగస్వాములుగా మారి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
నచ్చిన సేవలు.. మెచ్చిన ఆదాయం!
ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వారు కేవలం ఒకే రకమైన పనికి పరిమితం కానక్కర్లేదు. మార్కెట్ అవసరాలను బట్టి కింద పేర్కొన్న నాలుగు రకాల వ్యాపార నమూనాలలో తమకు నచ్చిన దాన్ని ఎంచుకునే వెసులుబాటును తపాలాశాఖ కల్పించింది:
- బుకింగ్ సేవలు: కేవలం స్పీడ్ పోస్ట్, పార్సిళ్లు, అంతర్జాతీయ ఈఎమ్‌ఎస్ పత్రాలను బుక్ చేయడం.
- డెలివరీ సేవలు: ఈ-కామర్స్ పార్సిళ్లను కస్టమర్ల ఇళ్లకు చేరవేయడం.
- పికప్ సేవలు: నేరుగా వర్తకులు లేదా ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి పార్సిళ్లను సేకరించడం.
- ఆల్ ఇన్ వన్ సేవలు: పైన పేర్కొన్న బుకింగ్, డెలివరీ, పికప్ వంటి అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడం.

కావలసిన కనీస అర్హతలు ఇవే:
ఈ ఉపాధి పథకంలో చేరడానికి కనీసం 18 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. బుకింగ్ కౌంటర్ తెరవాలనుకునే వారు 12వ తరగతి (ఇంటర్), పార్సిల్ డెలివరీ చేయాలనుకునే వారు 10వ తరగతి పాసై ఉంటే చాలు. స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్ ఆపరేట్ చేయడం తెలిసి ఉండాలి. ఒకవేళ డెలివరీ సేవలను ఎంచుకుంటే మాత్రం సొంతంగా ఒక టూవీలర్ (వాహనం) , చెల్లుబాటులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. అయితే, ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న పోస్టల్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఈ ఫ్రాంచైజీలు కేటాయించరు.
మౌలిక వసతులు & సెక్యూరిటీ డిపాజిట్:
బుకింగ్ కేంద్రాన్ని నడపడానికి ఒక చిన్న గది లేదా షాప్ ఉండి, అందులో కంప్యూటర్/స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ , ఒక ప్రింటర్ ఉండాలి. ఈ బిజినెస్ మోడల్‌ను బట్టి రీఫండబుల్ (తిరిగి ఇచ్చేసే) సెక్యూరిటీ డిపాజిట్‌ను ఖరారు చేశారు. కేవలం పికప్ లేదా డెలివరీ సేవలకు రూ. 5,000, బుకింగ్ కేంద్రానికి రూ. 10,000, అన్ని రకాల సేవలను కలిపి నిర్వహించే 'ఫుల్ ఫ్రాంచైజీ'కి రూ. 15,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
పెరిగే లావాదేవీలు.. అదనపు కమీషన్లు!
ఈ కొత్త విధానంలో లావాదేవీలన్నీ 'ఏపీటీ 2.0' మొబైల్ యాప్ , సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే జరుగుతాయి. ప్రతి బుకింగ్, డెలివరీపై ఆకర్షణీయమైన కమీషన్ నేరుగా లభిస్తుంది. వ్యాపార పరిమాణం పెరిగే కొద్దీ కమీషన్ శాతాన్ని కూడా పెంచుతారు. ముఖ్యంగా క్యాష్ ఆన్ డెలివరీ (COD) పార్సిళ్లపై అదనపు లాభాలు ఉంటాయి.
దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది?
ఇండియా పోస్ట్ ఈ ఫ్రాంచైజీల భర్తీ కోసం ప్రతి సంవత్సరం నాలుగు సార్లు (జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు నెలల్లో) విడతల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలను బట్టి ఎంపికైన వారికి తపాలాశాఖ పూర్తిస్థాయిలో ఉచిత శిక్షణ ఇస్తుంది. అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్న 30 రోజుల్లోపే మీ సొంత వ్యాపారాన్ని లాభసాటిగా ప్రారంభించుకోవచ్చు.














Click it and Unblock the Notifications