హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌పై వ్యాఖ్య: అడ్డంగా దొరికిపోయిన ఆజాద్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad - YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలతో కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ అడ్డంగా దొరికిపోయారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీలోనే ఉంటే భవిష్యత్తులో ఏదో ఓ పదవి వచ్చేదని, కేంద్రమంత్రి లేదా ముఖ్యమంత్రి అయి ఉండేవారని ఆజాద్ ఇటీవల తన ఉప ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

ఆజాద్ వ్యాఖ్యలు అటు వైయస్సార్ కాంగ్రెసు, ఇటు తెలుగుదేశం పార్టీలకు టానిక్‌లా పని చేస్తున్నాయి. ఆజాద్ వ్యాఖ్యలపై ఇరు పార్టీలు తీవ్రస్థాయిలో స్పందించాయి. కాంగ్రెసు పార్టీలోనే ఉంటే జగన్‌కు పదవులు దక్కేవని చెప్పడం ద్వారా అతను బయటకు వెళ్లినందుకే కుట్ర పూరితంగా అతనిపై కేసులు బనాయిస్తున్నారనే విషయం తేటతెల్లమవుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శిస్తుండగా, మీకు అనుకూలంగా ఉంటే ఎంత పెద్ద ఆర్థిక నేరాలకు పాల్పడినా వారికైనా క్లీన్ చిట్ ఇచ్చి పదవులు ఇచ్చేస్తారా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది.

టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. లక్ష కోట్ల ప్రజాధనం లూఠీ చేసిన జగన్ కాంగ్రెస్‌లో ఉండి ఉంటే పదవులు ఇస్తారా? ఎంత దోచినా మీ పార్టీలో ఉంటే నెత్తిన పెట్టుకొంటారా? ఆ మాట అనడానికి సిగ్గు లేదా అని మండిపడ్డారు. కాంగ్రెసులో ఉండి ఉంటే జగన్ సిఎం అయి ఉండేవారని ఆజాద్ చెప్పడం దారుణమని, ఆయనను అరెస్టు చేయాలని టిడిపి నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఒక వ్యక్తిని జైలుకు పంపడానికి మరో వ్యక్తిని బలి చేశారని, మిగిలిన వారి జోలికి మాత్రం పోవడం లేదని మండిపడ్డారు.

ఆజాద్ వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ మరియు జగన్ సోదరి షర్మిల ఘాటుగానే స్పందించారు. తన తనయుడు జగన్ కాంగ్రెసులో ఉంటే ముఖ్యమంత్రిని చేసేవారట, వీడినందుకే ఈ దోషిని చేశారని చెప్పకనే చెబుతున్నారని, ఈ విషయం ఆజాదే స్వయంగా చెబుతున్నారని వైయస్ విజయమ్మ వెంటనే స్పందిస్తూ తన ప్రచారంలో పాయింటవుట్ చేశారు. నాయకుల మాటలే జగన్‌పై కక్ష కట్టారనేందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయని సోదరి షర్మిల వ్యాఖ్యానించారు. జగన్‌ను వేధిస్తున్నామని వారే ఒప్పుకున్నారని విమర్శించారు.

బెదిరించి కాళ్ల బేరానికి వస్తారని భ్రమ పడవద్దని, జగన్ అరెస్టు మా కుట్రే అని కాంగ్రెసు నేతలు పరోక్షంగా చెబుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర రెడ్డి తదితరులు అన్నారు. కాగా ఆజాద్ వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతలు కూడా అంతర్మథనం చెందుతున్నారని అంటున్నారు. అయితే ఆజాద్ మాత్రం తన వ్యాఖ్యలను మీడియా సరిగా అర్థం చేసుకోలేదని, ఉర్దూలో మాట్లాడటం వల్లనే ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు.

English summary
AICC general secretary Ghulam Nabi Azad’s observations that Kadapa MP Y.S. Jagan Mohan Reddy could have become Union minister and later the CM if he stayed back in the Congress have landed him and the party in an embarrassing situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X