తెలంగాణ: జగన్‌పై లగడపాటి నిప్పులు, జెసికి కితాబు

హైదరాబాద్ మా సొత్తు అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటే తాను, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి గట్టిగా స్పందించామని లగడపాటి అన్నారు. జెసి దివాకర్ రెడ్డికి ట్రావెల్స్ బస్సులు ఉన్నాయని, అయినప్పటికీ అతను బెదరకుండా ధీటుగా స్పందించారని కితాబిచ్చారు. తాను కూడా భయపడలేదన్నారు. అలాంటిది పులివెందుల పులి బిడ్డను అని చెప్పుకునే వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదన్నారు.
కేవలం మాటలకే ఆయన పులివెందుల పులి బిడ్డ అని కానీ చేతల్లో ఏమీ లేదన్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర పైన ఆయన ఇప్పటి వరకు ధైర్యంగా ప్రకటన చేశారా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమైక్యాంద్రకు మద్దతు పలికారని, జగన్ మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదన్నారు. వైయస్ మాట తప్పరని, జగన్ నోరు విప్పరని ఆయన ఎద్దేవా చేశారు.
తాను వస్తుంటే రహదారులో వైయస్ జగన్ పెట్టించిన దివంగత వైయస్ విగ్రహాలను చూశానని, ఏ విగ్రహాన్ని చూసినా వైయస్ చేతులెత్తి హస్తానికి ఓటు వేయమన్నట్లుగా ఉందని చెప్పారు. వైయస్ ఎప్పుడూ కాంగ్రెసు నేతే అన్నారు. జగన్ ఎప్పుడైనా సమైక్యాంధ్ర కోసం మాట్లాడారా అని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోరుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెసు కోసం అందరం కలిసి పని చేశామని చెప్పారు.
కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎవ్వర్నీ లెక్క చేయకుండా పోరాటం చేశామన్నారు. జగన్ దృష్టిలో బిసి అంటే బ్రీఫ్ కేసని, ఎస్సీ అంటే సూటుకేసన్నారు. వారిని డబ్బులతో కొనవచ్చని జగన్ ఉద్దేశ్యమని విమర్శించారు. కాగా ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి, గంగుల ప్రతాప్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications