దాడి - ఎదురుదాడి: ముగిసిన ప్రచారం

Chiranjeevi - Chandrababu Naidu - YS Jagan
హైదరాబాద్: ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఉప ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఈ నెల 12వ తేదిన(మంగళవారం) రాష్ట్రంలోని పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2014 సాధారణ ఎన్నికలకు వీటిని సెమీ ఫైనల్స్‌గా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. సెంటిమెంట్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, అభివృద్ధి, సంక్షేమంతో అధికార కాంగ్రెసు పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి, కాంగ్రెసు పార్టీ వైఫల్యాలతో తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహించాయి.

ఆయా పార్టీల నేతలు అందరూ ఉప ఎన్నికలు జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గం స్థానాలలో జోరుగా ప్రచారం నిర్వహించారు. మండుటెండలు సైతం లెక్కచేయకుండా వారు ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెసు పార్టీ తరఫున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడి చిరంజీవి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ప్రచారం నిర్వహించారు. కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి కూడా రెండు మూడు రోజులు పాల్గొన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున గత 27వ తేది వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. 27న సిబిఐ అతనిని అరెస్టు చేయడంతో ఆయన స్థానంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిల ప్రచారం నిర్వహించారు. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వన్ మెన్ ఆర్మీ పాత్ర పోషించారు. ప్రచారం ఆధ్యంతం ఆ పార్టీ ప్రచారంలో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. మరో ముఖ్య నేత లేకపోవడంతో ఆయన ఒక్కడే అన్ని నియోజకవర్గాలను చుట్టి వచ్చారు.

నేతలు ఒకటికి రెండు, రెండుకు మూడుసార్లు ఆయా నియోజకవర్గాలలో పర్యటించి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కాలుకు బలపం కట్టుకొని తిరిగారు. ప్రచార పర్వంలో నేతలు విమర్శలు, ఎదురుదాడులు చేశారు. బాబు ప్రధానంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిని అస్త్రంగా చేసుకొని ప్రచారం నిర్వహించారు. పనిలో పనిగా కాంగ్రెసు పైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఉంటాయనే ప్రచారం నేపథ్యంలో బాబు వారి పైనే ప్రధానంగా విమర్శుల చేశారు. ఆయా నియోజకవర్గాలలో జగన్ అవినీతితో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల అవినీతి చిట్టాను కూడా విప్పారు.

ఇక కాంగ్రెసు పార్టీ అభివృద్ధి, సంక్షేమమే తమ నినాదం అని చెప్పినప్పటికీ సందర్భం వచ్చినప్పుడు జగన్ అవినీతి పైన ప్రచారం నిర్వహించాయి. అయితే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన విమర్శలు చేయాలా వద్దా అనే అంశంపై తొలుత పార్టీ నేతలలో తీవ్రమైన చర్చ జరిగింది. అది ఎటూ తేలలేదు. అయితే బొత్స, కిరణ్ వంటి నేతలు వైయస్‌ను జగన్‌ను వేర్వేరుగా చూడాలని, జగన్ అవినీతిపరుడని వైయస్ మాట తప్పని నేత అని చెప్పారు.

అదే పార్టీకి చెందిన చిరంజీవి మాత్రం కొన్ని సందర్భాలలో వైయస్ రాజశేఖర రెడ్డి పైన కాస్త ఘాటైన విమర్శలే చేశారు. వి.హనుమంత రావు వంటి నేతలు తొలి నుండి జగన్‌తో పాటు వైయస్ఆర్ పైన మాటల దాడి చేస్తున్నారు. విహెచ్ ఉప ఎన్నికల సమయంలోనూ అది కొనసాగించారు. లగడపాటి రాజగోపాల్ ప్రజాహిత పాదయాత్ర పేరుతో నియోకవర్గాలన్నింటిని చుట్టి వచ్చారు. చంద్రబాబు, విజయమ్మ, షర్మిల, కిరణ్, ఆజాద్, బొత్స అందరూ తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఒకే ఒక్క నియోజకవర్గం పరకాలలో పర్యటించారు.

అయితే లగడపాటి రాజగోపాల్, చిరంజీవిలు మాత్రం పరకాలకు రాలేదు. ఉప ఎన్నికల ప్రచారంలోనూ సమైక్యవాదం వినిపిస్తున్న లగడపాటి తాను వస్తే నష్టం జరుగుతుందనే ఊరుకున్నట్లుగా సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున జగన్ అరెస్టుకు ముందే పరకాల మినహా దాదాపు అన్ని నియోజకవర్గాలలో పర్యటించారు. ఆయన అరెస్టు తర్వాత వైయస్ విజయమ్మ, షర్మిల మిగిలిన ప్రచారం నిర్వహించారు.

వైయస్ విజయమ్మ, షర్మిలల ప్రచార సభలకు జనాలు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీనిపై బొత్స మాట్లాడుతూ.. తొలిసారి ప్రజలలోకి వచ్చినందున వారిని చూసేందుకు జనాలు వస్తున్నారని చెప్పారు. అయితే వచ్చిన వారంతా ఓటు వేస్తామని చెప్పలేం. ఇందుకు 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీయే మంచి నిదర్శనం. వాళ్ల విషయంలో బొత్స చెప్పింది వాస్తవమో కాదో తేలాలంటే 15వ తేది వరకు ఆగాలి.

అయితే వైయస్ విజయమ్మ, షర్మిలలు ప్రజల నుండి సానుభూతి పొందేలా ప్రచారం నిర్వహించారు. ప్రజల నుండి వారు జాలి, సానుభూతిని ఆశిస్తూ ఆ విధంగానే ప్రచారం చేసినట్లుగా కనిపిస్తోంది. టిడిపి, కాంగ్రెసు విమర్శలను తిప్పి కొడుతూనే వైయస్ హెలికాప్టర్ ప్రమాదం, జగన్ అరెస్టును వారు ప్రధానంగా ప్రస్తావించారు. సానుభూతి పొందటం కోసమే ఈ అస్త్రాలు ఎక్కుపెడుతున్నారని టిడిపి, కాంగ్రెసు అంతే ధీటుగా స్పందించింది. హెలికాప్టర్ ప్రమాదంపై విజయమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తూ పెద్ద చర్చకు తెర లేపారు.

అందుకు బొత్స వారి కుటుంబం పైనే అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. పరిటాల రవీంద్ర హత్య కేసు కూడా ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా కనిపించింది. ముఖ్యమంత్రి కూడా పలుమార్లు పరిటాల హత్య విషయమై ప్రచారంలో ప్రస్తావించారు. పరకాలలో చంద్రబాబు, విజయమ్మ, షర్మిలకు చేదు అనుభవం ఎదురవుతుందోమోననే ఆందోళన కలిగించింది. కానీ వారి పర్యటన ఎలాంటి ఉద్రిక్తతలకు తావీయకుండా సాఫీగా జరిగిపోయింది.

సీమాంధ్రలోని అన్ని నియోజకవర్గాలలో ముక్కోణపు పోటీ ఉండగా పరకాల మాత్రం అందుకు మినహాయింపుగా ఉందనే చెప్పవచ్చు. ఇక్కడ ఐదు పార్టీలో పోటీలో ఉన్నప్పటికీ.. తెలంగాణవాదం వినిపిస్తున్న బిజెపి, తెరాసల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెలంగాణవాదుల ఓటు చీలుతుండటంతో టిడిపి, కాంగ్రెసు గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ కూడా తెలంగాణ ఓట్ల చీలికతో పాటు వైయస్‌పై అభిమానం, జగన్ సానుభూతి తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.

మరోవైపు ఓ వైపు ప్రచారం జరుగుతుండగానే పోలీసులు భారీ ఎత్తున డబ్బులను పట్టుకున్నారు. రూ.40 కోట్లకు పైగా డబ్బును ఎన్నికల సంఘం స్వాధీనం చేసుకుంది. ఇంకా పట్టుచీరలు, ద్విచక్ర వాహనాలు తదితర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ చెప్పారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసిందని చెప్పారు.

పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గంలో 5,413 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 46 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. నేతలు దాదాపు నెల రోజుల పాటు ఉప ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపారు. మరి ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+