పోటా పోటీ: తెలంగాణ కోసం సుష్మ, వైయస్‌పై కెసిఆర్

ప్రత్యేక తెలంగాణ బిల్లు పెట్టగలిగేది బిజెపి మాత్రమేనని, దీనిపై రాజ్యసభలో తమ పార్టీ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టారన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోరాడుతున్న ఏకైక జాతీయ పార్టీ తమదే అన్నారు. ప్రత్యేక రాష్ట్రంపై పార్లమెంట్‌లో చర్చ మొదలైందని, తెలంగాణ ప్రజలు కొద్ది రోజులు ఓపిక పట్టాలని సూచించారు. యూపిఏ మెడలు వంచి మరీ తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. అదీ లేదంటే 2014లో కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. అప్పుడు తెలంగాణ ఇచ్చి తీరుతామని ప్రకటించారు.
2004 ఎన్నికల సందర్భంగా కరీంనగర్‌లో జరిగిన ప్రచార సభలో సోనియా తెలంగాణ ఇస్తామని ప్రకటించి... ఆ తర్వాత ఈ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాష్ట్రాలను విభజించడం వల్ల ప్రజల మధ్య శత్రుత్వాలు పెరుగుతాయని, ఐక్యత కొరవడుతుందని చేస్తున్న ప్రచారంలో నిజం లేదని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖంఢ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశాని, మరి ప్రజల మధ్య వైషమ్యాలు, విభేదాలు పెరిగాయా అని ప్రశ్నించారు.
రెండు కళ్ల సిద్ధాంతం అనుసరిస్తున్న తెలుగుదేశం ఎటువైపు చూస్తోందో అర్థంకాని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. యుపిఏ సర్కారుపై మండిపడ్డారు. కాగా వర్షంతో బిజెపి సభకు తీవ్ర అంతరాయం కలిగింది. సభ అంతా రసాభాసగా మారింది. మైకులు సరిగా పని చేయలేదు. సుష్మా స్వరాజ్ సభా ప్రాంగణానికి వచ్చినప్పటికీ... భారీ వర్షం వల్ల ఆమె వేదిక మీదకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. వర్షం పడుతున్నా ప్రజలు తడుస్తూనే సుష్మా స్వరాజ్ ప్రసంగం వినేందుకు ఎదురుచూస్తూ నిలుచున్నారు.
తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న బిజెపిపై ప్రాంతీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 2005 నుంచి తెలంగాణ కోసం పోరాడుతున్నది బిజెపియేనన్నారు. తమ పార్టీపై టిఆర్ఎస్ పనిగట్టుకొని విషప్రచారం చేస్తోందని విమర్శించారు. టిఆర్ఎస్ అసత్య ఆరోపణలకు పరకాల ప్రజలు తగిన జవాబు చెబుతారని పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలంగాణలో ఒక మాట, సీమాంధ్రలో మరో మాట మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ పట్ల బిజెపికి ఉన్న చిత్తశుద్ధిని శంకించడంలో అర్థం లేదన్నారు.
మరోవైపు దేశాన్ని పాలించేది ప్రాంతీయ పార్టీలేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిజెపిని ఉద్దేశించి పరకాల ఉప ఎన్నికల ప్రచారం సభలో అన్నారు. పనిలో పనిగా ఆయన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపైన విరుచుకు పడ్డారు. వైయస్ పాలన కారణంగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు పోయిందన్నారు. దేశంలో తలెత్తుకోలేని స్థితిలో పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పుడు మళ్లీ వైయస్ పాలన వస్తే తెలంగాణ నెత్తిన టోపీ పెట్టడం ఖాయమని హెచ్చరించారు. సరిగ్గా ఒక్కరోజు ముందు పరకాల నియోజకవర్గంలో వైయస్ విజయమ్మ పర్యటించిన నేపథ్యంలో... ప్రధానంగా ఆమె వ్యాఖ్యలను, జగన్‌ను లక్ష్యంగా చేసుకుని కెసిఆర్ మాట్లాడారు.
జగన్ ముఖ్యమంత్రి అయితే వైయస్ పాలన మళ్లీ వస్తుందని విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఖమ్మం జిల్లాలోని బయ్యారం ప్రాంతంలోని అపారమైన, విలువ కలిగిన 1.50లక్షల ఎకరాల విస్తీర్ణంలోని గనులను తన కూతురు షర్మిలకు వైయస్కట్నంగా రాసిచ్చారన్నారు. రాయలసీమ ప్రాంతంలోని వనరులను కొడుకు జగన్‌కు కట్టబెట్టారన్నారు. అలాంటి వైయస్ పాలన మళ్లీ వస్తే తెలంగాణ ప్రజల నెత్తిన టోపీ పెట్టినట్లేనన్నారు. దొంగలకు కొండా సురేఖ, మురళి సద్దులు కట్టినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.
జగన్ జైలు నుంచి తిరిగి వస్తారని, ముఖ్యమంత్రి కాగానే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారని సీమాంధ్రలో విజయమ్మచెబుతున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు అంతో ఇంతో ఉపయోగపడే జల వనరుగా ఉన్న గోదావరి నీళ్లను తీసుకుని వెళ్లే కుట్రలో భాగంగానే పోలవరం ప్రాజెక్టుకు వైయస్ హయాంలో రూపకల్పన జరిగినట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సమర్థిస్తారా? అని కొండా దంపతులను నిలదీశారు.












Click it and Unblock the Notifications