ఆళ్లగడ్డ: చిరంజీవిని ఎదుర్కొని శోభా నాగి రెడ్డి నిలిచేనా?

గత ఎన్నికలతో పోలిస్తే సామాజిక, రాజకీయ సమీకరణాలు సమూలం గా మారడానికితోడు ముగ్గురూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే కావడంతో నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శోభా నాగి రెడ్డి ప్రధానంగా జగన్‌పై ఉన్న సానుభూతిని నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. ఆమె భర్త, మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి గతానికి భిన్నంగా ఓ మెట్టు కిందికి దిగి ఆళ్లగడ్డలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఓటును శోభకు కాకుండా జగన్‌కు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
అయితే, ఉప ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో జరిగిన ఆరు హత్యలు భూమా కుటుంబానికి కొంత నష్టం చేకూర్చేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు, బలిజ సామాజిక వర్గీయులు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ వర్గానికి చెందిన ఎక్కువమంది నేతలు భూమాను వీడడం వైయస్సార్ కాంగ్రెసుకు నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి ఆళ్లగడ్డ వచ్చిన చిరంజీవి తనకు గతంలో భూమా వర్గీయులు పిండ ప్రదానం చేయడాన్ని పదేపదే గుర్తు చేయడంతో ఆ సామాజికవర్గ ఓట్లు శోభకు దూరమైనట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాప్ రెడ్డికి కొంత అనుకూల వాతావరణం ఏర్పడిందనే చెప్పొచ్చు. భూమా కుటుంబంపై గతంలో మూడుసార్లు విజయం సాధించిన ప్రతాప రెడ్డి.. 2009లో తన ముగ్గురు సోదరుల్లో కొందరు సహకరించక పోవడంతో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. దీనికితోడు బలిజలు, చిరంజీవి అభిమానులు, యువకులు పిఆర్పీవైపు మొగ్గుచూపడం గంగుల ఓటమికి మరో కారణం. అయితే, అప్పట్లో శోభా నాగి రెడ్డి వెంట వెళ్లిన బలిజలు, చిరంజీవి అభిమానులు తిరిగి గంగులకు అనుకూలంగా మారడం, అన్నదమ్ములంతా ఐక్యంగా ప్రచారం చేస్తుండడంతో కాంగ్రెస్ ప్రచారం ఊపందుకుంది.
2009 ఎన్నికల్లో కేవలం 23 వేల ఓట్లు సాధించిన టిడిపి అభ్యర్థి ఇరిగెల రాంపుల్లా రెడ్డి ఉప ఎన్నికల నాటికి పుంజుకున్నారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ ఓట్లను చీల్చగలిగే స్థితికి ఎదిగారు. 2009లో సరైన పార్టీ కార్యకర్తలను, నాయకులను తయారు చేసుకోలేకపోయిన ఇరిగెల ఈ మూడేళ్లలో ఆ లోటును భర్తీ చేసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం, భూమా దంపతులకు దీటుగా ప్రచారంలో పార్టీ శ్రేణులకు భరోసా ఇవ్వడం రాంపుల్లా రెడ్డి ప్రతిష్ఠ పెరగడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
కాగా, తన రాజకీయ జీవితంలో రాంపుల్లా రెడ్డి 1991లో భూమా నాగిరెడ్డి అనుచరుడిగా, ఆ తర్వాత గంగుల అనుచరుడిగా పనిచేశారు. భూమా టిడిపిని వదిలిన తర్వాత ఆ పార్టీకి ఇరిగెల అభ్యర్థిగా మారారు. తన ప్రత్యర్థుల అనుచరుల్లో కొందరిని తనవైపు తిప్పుకోవడంతో ఈ ఉప ఎన్నికల్లో టిడిపి కొంత పుంజుకుంది. ఈ ఎన్నికల్లో రాంపుల్లా రెడ్డి ఎవరి ఓట్లను ఎక్కువగా చీలుస్తారనే అంశంతోపాటు బలిజలు ఎటువైపు మొగ్గు చూపుతారనే దానిపై తుది ఫలితం ఆధారపడి ఉంటుంది.












Click it and Unblock the Notifications