జగన్ మెజారిటీ సీట్లు గెలిస్తే ప్రభుత్వం పడిపోతుందా?

మరో అంచనా ప్రకారం - వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 9 సీట్లు మాత్రమే వస్తాయని, నాలుగు సీట్లు కాంగ్రెసుకు, మరో నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీకి, మరో సీటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి వస్తాయనే అంచనా సాగుతోంది. తెలంగాణలో ఎన్నిక జరుగుతున్న ఏకైక సీటు పరకాలలో బిజెపి, తెరాసల మధ్య తెలంగాణవాదం ఓట్లు పెద్ద యెత్తున చీలితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కొండా సురేఖ బయటపడవచ్చునని కూడా అంటున్నారు.
కాంగ్రెసు ఈ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైతే మాత్రం రాజకీయాలు తీవ్రమైన మార్పులకు గురయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పు ఉండదని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు చెబుతున్నప్పటికీ ముఖ్యమంత్రిపై అసమ్మతి గళం పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఈ ఎన్నికలు పరీక్ష. ఈ ఎన్నికల్లో ఫలితాలను బట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పార్టీకి కొత్త దిశను, కొత్త నిర్మాణాన్ని ఇవ్వకతప్పక పోవచ్చు.
అత్యధిక స్థానాలు గెలుచుకుంటే జగన్ వైపు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రావచ్చుననే అంచనా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు శాసనసభ్యులు కాంగ్రెసుకు రాజీనామా చేసి జగన్ వైపు వెళ్లారు. ఈ సంఖ్య ఉప ఎన్నికల తర్వాత పెరుగుతుందని అంటున్నారు. పరకాలలో తెరాసనో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే కాకుండా బిజెపి గెలిస్తే కాంగ్రెసు అధిష్టానం తీవ్రంగానే తీసుకోవచ్చు.
తెలంగాణవాదం బలంతో తెలంగాణలో బిజెపి పుంజుకుంటుందనే సంకేతాలు కాంగ్రెసు అధిష్టానానికి వెళ్తాయి. రాష్ట్రంలో నామమాత్రంగా ఉన్న బిజెపి పాగా వేసేందుకు రంగం సిద్ధమైనట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే భయం కాంగ్రెసు అధిష్టానానికి పట్టుకుంటుంది. మొత్తం మీద, ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మరింతగా ముదిరే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications