మమత ఒంటరి: రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీయే

సోనియా గాంధి ప్రణబ్ పేరును ప్రకటించిన కొంత సేపటికే ప్రధాన మంత్రి డాక్టర్ మన్ మోహన్ సింగ్ రంగంలోకి దిగారు. అన్ని పార్టీల నాయకులకూ ఫోన్ చేసి ప్రణబ్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌కు కూడా ప్రధాని ఫోన్ చేసి ఇదే విషయమై అభ్యర్థించారు. సోనియా గాంధి శుక్రవారంనాడు ప్రణబ్ ముఖర్జీ పేరు ప్రకటించిన కొంత సేపటికే బిఎస్పీ నాయకురాలు మాయావతి లక్నోలో మీడియా సమావేశాన్ని నిర్వహించి తాము ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. సోనియా గాంధి, మన్ మోహన్ సింగ్ కూడా తమతో ఈ విషయమై చర్చించారని, అందుకు తాము కూడా సానుకూలంగా స్పందించామని ఆమె చెప్పారు. ములాయం కూడా ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఎస్పీ నిర్ణయంతో మమత ఒంటరి అయిపోయినట్టు కనిపిస్తున్నది. అయితే, ఆట పూర్తి కాలేదని మమతా బెనర్జీ అంటున్నారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీని ఏకాభిప్రాయంతో ఎంపిక చేసే విషయమై శుక్రవారం నాడు జరిగిన సమావేశానికి త్రిణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ హాజరు కాలేదు. ఆమె మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌నే తెరపైకి తీసుకురావాలని యత్నిస్తున్నారు. అయితే యుపిఎ కోరినట్టు ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించాలంటే తాము కోరినట్టు బెంగాల్ ప్యాకేజికి అంగీకరించాలని మమతా పట్టు పట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు అంగీకరించని సోనియా చివరికి తమ అభ్యర్థిగా ప్రణబ్ పేరును ప్రకటించారు. అయితే మమతా బెనర్జీ ఇంకా తమ పంతం విడవలేదని తెలుస్తున్నది. త్రిణమూల్ నాయకుడు దినేష్ త్రివేది మాత్రం యుపిఎతో గొడవలు తెచ్చుకోకుండా, ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని బలపరిస్తేనే మమతకు బాగుంటుందని సలహా ఇచ్చారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన చెప్పారు.
మమతా బెనర్జీ తమ తండ్రిగారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సభ్యుడైన అభిజిత్ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. ఇది తాను రాజకీయంగా చేస్తున్న విజ్ఞప్తి కాదని, ఒక బెంగాలీగా తోటి బెంగాలీకి చేస్తున్న సవినయ వినతిగా భావించాలని ఆయన ఒక జాతీయ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. యుపిఎ ప్రతిపాదనను బిజెడి త్రోసిపుచ్చింది. ప్రణబ్ ముఖర్జీ పేరును సోనియా ప్రకటించిన అనంతరం సిపిఎం ప్రణబ్‌ను అభినందించింది. అయితే రేపు జరిగే పార్టీ సమావేశంలోనే ప్రణబ్ అభ్యర్థిత్వంపై అధికారికంగా నిర్ణయం తీసుకోగలమని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications