వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణబ్‌కు బాబు మద్దతు: యుపిఎనుంచి మమత ఔట్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెసు నాయకత్వంలోని యుపిఎ ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా రేసు నుంచి ప్రముఖ శాస్త్రవేత్త ఎపిజె అబ్దుల్ కలాం తప్పుకోవడంతో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ప్రకటించే ఆలోచన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవ ఎన్నిక జరిగే సంప్రదాయాన్ని నిలబెట్టడానికి చంద్రబాబు ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సిద్ధపడినట్లు సమాచారం. కెసిఆర్‌తో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడారు. తెలంగాణ ఇచ్చేది యుపిఎనే కాబట్టి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు తెలపడమే సరైందనే ఆలోచన తెరాసలో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తెరాస అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే, తాజాగా 15 మంది శానససభ్యులను గెలుచుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఎవరికి మద్దతిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు, రాష్ట్రపతి పదవికి అబ్దుల్ కలాం పేరును ప్రతిపాదించిన తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాదాపుగా ఏకాకి అయ్యారు. యుపిఎ నుంచి వైదొలిగే ఆలోచనలో తృణమూల్ కాంగ్రెసు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ తాము కలాంనే ప్రతిపాదిస్తామని తృణమూల్ కాంగ్రెసు అంటోంది. పోటీకి కలాంను తాము ఒప్పిస్తామని అంటోంది. పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల సమావేశానంతరం పార్టీ పార్లమెంటు సభ్యుడు సుదీప్ బంధోపాధ్యాయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

కేంద్రంలో యుపిఎ ప్రభుత్వాన్ని కాంగ్రెసు మాత్రమే నడిపించడం లేదని, 19 మంది సభ్యులతో తమ పార్టీ యుపిఎలో రెండో పెద్ద పక్షమని ఆయన అన్నారు. కాగా, ఆరుగురు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తూ లేఖలను పార్టీ అధినేత మమతా బెనర్జీకి సమర్పించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే, అందులో నిజం లేదని సుదీప్ బంధోపాధ్యాయ అన్నారు.

తమంత తాముగా యుపిఎ నుంచి వైదొలిగేది లేదని, కాంగ్రెసు వద్దనుకుంటే బయటకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని సుదీప్ బంధోపాధ్యాయ చెప్పారు. యుపిఎ ప్రభుత్వాన్ని తాము పడగొట్టదలుచుకోలేదని, ఆ విషయంలో పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. పరిస్థితి వస్తే రాజీనామాలు చేయడానికి మంత్రులు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. మొత్తం మీద, పరిణామాలు మాత్రం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్నాయి.

English summary
It is said that Telugudesam president N Chandrababu Naidu may support Pranab Mukherjee's candidature for president post. The Trinamool Congress on Monday described as "untrue" reports that its Central government ministers have handed over their resignation letters to party chief Mamata Banerjee, but said they were prepared to leave the United Progressive Alliance if they were unwanted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X