ఎప్పుడూ చూడని కొత్త పాత్రలో లేడీ పవర్ స్టార్..
టాలీవుడ్ ప్రేక్షకులకు లేడి పవర్ స్టార్ సాయి పల్లవి.. ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. మలయాళం లో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుణ్ తేజ్ "ఫిదా" తో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో మరో స్థాయిలో ఫిదా చేసింది. ఆ తర్వాత ఎంసీఏ, పడి పడి లేచే మనసు, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి సినిమాల్లో నటించి నటిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు.
రీసెంట్ గానే తమిళంలో శివకార్తికేయన్ సరసన నటించిన "అమరన్" సినిమా ఘనవిజయం సాధించింది. అలాగే తెలుగులో నాగచైతన్యతో కలిసి నటించిన "తండేల్" కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేసిన ఈ భామ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా, ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అవతారంలో సాయి పల్లవి కనిపించబోతుందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.

'రామాయణ'లో సీతగా..
ప్రస్తుతం సాయి పల్లవి నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ "రామాయణ" లో ఆమె సీతదేవి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుమారు రూ.1600 కోట్లు బడ్జెట్ కేటాయించగా, ఇది రెండు భాగాలుగా రూపొందుతుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. పలువురు బాలీవుడ్, దక్షిణాది స్టార్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
అంతే కాకుండా ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న "D55" లో ఆమె పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు వినిపిస్తున్నాయి. అమరన్ మూవీ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో రాబోతున్న ఈ మూవీ.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందనున్నట్టు చర్చ నడుస్తోంది. సాయి పల్లవితో పాటు శ్రీలీల కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం.
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ చిత్రంలో ఆమె ఒక కఠినమైన పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించబోతున్నారు. నేరస్థులను వెంబడించే ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ఆమె కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సాయి పల్లవి కెరీర్‌లో ఇది పూర్తిగా కొత్త తరహా పాత్రగా చెప్పుకుంటున్నారు. మరోవైపు శ్రీలీల పాత్ర కూడా సినిమాకు కమర్షియల్ హంగులను తెస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్లాస్, మాస్ ఆడియన్స్‌ను ఒకేసారి ఆకట్టుకునేలా దర్శకుడు పాత్రలను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications