ఇండియన్ ఆర్మీ సంచలనం.. 23 వేల కోట్లతో.. చైనా, పాక్ కు బ్యాడ్ న్యూస్..!
ప్రస్తుతం యుద్ధాల తీరు మారిపోయింది. యుద్ధంలో సాంకేతికత వినియోగం అధికం అయిపోయింది. ఇక భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటూనే ఉంది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ లో చైనా, టర్కీ దేశాలు సరఫరా చేసిన ఆయుధాలను భారత్ పైకి ప్రయోగించింది పాకిస్థాన్. కానీ వాటిని భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ విధంగా యుద్ధ సమయంలో పాకిస్థాన్ కు చైనా పరోక్షంగా సహకారం అందించింది.
అయితే సరిహద్దు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తూ వెళ్తుంది. తాజాగా రూ. 23 వేల కోట్లతో కీలక ఒప్పందానికి శ్రీకారం చుట్టింది. పాకిస్థాన్, చైనా సరిహద్దుల వద్ద భారత సైన్యం సుదూర శ్రేణి సామర్థ్యాన్ని పెంచడం కోసం ఈ వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించారు. భారత సైన్యం కోసం అదనంగా 300 లకు పైగా కే9 వజ్ర-టీ సెల్ఫ్ ప్రొపల్డ్ ట్రాక్డ్ హౌ విట్జర్ ఫిరంగులను కొనుగోలు చేయడమే ఈ రూ. 23 వేల కోట్ల భారీ డీల్ ముఖ్య ఉద్దేశం అని సమాచారం.
ఈ కీలక ప్రతిపాదనను ఈ వారంలోనే రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ బోర్డ్ ఆమోదం కోసం ఉంచనున్నారు. ఆ తర్వాత దీనిని ఫైనల్ క్లియరెన్స్ కోసం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీకి పంపుతారు. దశాబ్దాల కాలంలో భారత సైన్యం చేపట్టబోయే అతిపెద్ద ఆర్టిలరీ ఆధునీకరణ కార్యక్రమంలో ఇది ఒకటిగా భావించవచ్చు. ఇక ఈ కాంట్రాక్ట్ ను లార్సెస్ అండ్ టూబ్రో సంస్థకు అప్పగించనున్నారు. దక్షిణ కొరియాకు చెందిన హన్వా ఏరోస్పేస్ సాంకేతిక భాగస్వామ్యంతో ఎల్ అండ్ టీ గుజరాత్ లోని హజీరా ప్లాంట్ లో ఈ క్షిపణి లాంటి ఫిరంగులను పూర్తిగా భారత్ లోనే తయారు చేయనుంది.

ఇక కే9 వజ్ర ఫిరంగుల విశేషాలు చూస్తే.. వీటికి సాధారణ ఫిరంగుల మాదిరి కాకుండా ట్యాంక్ లాంటి బాడీని కలిగి ఉంటాయి. వీటిలో షూట్ అండ్ స్కూట్ సాంకేతికతను అమర్చనున్నారు. అంటే శత్రువులపై వేగంగా దాడి చేసి అవి తిరిగి దాడి చేసే లోపల సురక్షిత ప్రాంతాలకు చేరుకోగలవు. ఇవి 40 కిలోమీటర్ల దూరంలో కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రు స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో దాడులు చేయగలవు.












Click it and Unblock the Notifications