అమీర్‍పేట భూమి కేసు: రోశయ్యకు ఊరట, హాజరుపై స్టే

అమీర్పేట భూముల కేసులో రోశయ్య ఆగస్టు 2న వ్యక్తిగతంగా కాకుండా తన న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చుకోవచ్చునని తెలిపింది. రోశయ్య రాజ్యాంగ బద్దమైన వ్యక్తి కాబట్టి నోటీసులు జారీ చేసే అధికారం కోర్టుకు కూడా లేదని ఈ సందర్భంగా తెలిపింది. కాగా అమీర్ పేట భూముల కేసులో రోశయ్యకు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కోర్టు గతంలో సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఆగస్టు 2వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు రోశయ్యను ఆదేశించింది. ఈ కేసులో ఇంతకు ముందు సమర్పించిన నివేదికను కోర్టు తిరస్కరించింది. రోశయ్యను విచారించకుండా ఎసిబి నివేదికను కోర్టుకు సమర్పించింది. అమీర్‌పేట భూవ్యవహారంలో ఐఎఎస్ అధికారులు సమర్పించిన పత్రాలను, ఇతర సాక్ష్యాలను జోడిస్తూ తెలంగాణ న్యాయవాదుల సంఘం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఇంతకు ముందు ఫిర్యాదు చేసింది. రోశయ్యను రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది.
అమీర్‌పేటలోని మైత్రీవనం వద్ద కోట్లాది రూపాయల భూమిని డీనోటిఫై చేసిన కేసులో రోశయ్య చీటింగ్, అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. 2జి కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది టి. శ్రీరంగారావు - దురుద్దేశ్యాలతో విధులు నిర్వహించిన ప్రభుత్వ సేవకులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి అవసరం లేదని ఎసిబి కోర్టులో రోశయ్యకు వ్యతిరేకంగా వాదించారు.
ఈ కేసులో ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, టి. సన్యాసి అప్పారావు ఎసిబి కోర్టు ముందు గతంలో సాక్ష్యాలు ఇచ్చారు. భూమిని డీనోటిఫై చేయవద్దని తాము బలంగా చెప్పామని వారన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల ఖరీదు చేసే 9.14 ఎకరాల భూమిని డీనోటిఫై చేశారు. కాగా ఎసిబి కోర్టు సమన్లపై రోశయ్య హైకోర్టును ఆశ్రయించారు. తనకు వ్యక్తిగత హాజరును మినహాయించాలని కోరారు. దీంతో కోర్టు శుక్రవారం రోశయ్య హాజరుపై స్టే విధించింది.












Click it and Unblock the Notifications