గాలి బెయిల్ డీల్: ఎసిబి కస్టడీకి పట్టాభి రామారావు

పట్టాభిరామారావును ప్రతి రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించాలని ప్రత్యేక కోర్టు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)ని ఆదేశించింది. అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఫిర్యాదు చేయడంతో పట్టాభి రామారావుకు వైద్య పరీక్షలు చేయించాలని కూడా కోర్టు ఆదేశించింది. విచారణ అనంతరం ప్రతి రోజు సాయంత్రం పట్టాభి రామారావు సాయంత్రం ఐదు గంటల తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారని కూడా ఆదేశించింది.
పట్టాభి రామారావును మూడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఎసిబి కోర్టును కోరింది. తమ కస్టడీలో ఉన్న ఆయన కుమారుడు రవిచంద్రతో కలిపి పట్టాభి రామారావును విచారించాల్సి ఉందని, అందుకు పట్టాభి రామారావును తమ కస్టడీకి అప్పగించాలని ఎసిబి కోర్టుకు తెలిపింది. ఈ కేసులో రవిచంద్రను, రిటైర్డ్ న్యాయమూర్తి చలపతి రావును కోర్టు ఇది వరకే ఎసిబి కస్టడీకి అప్పగించింది.
గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన తర్వాత రవిచంద్ర, చలపతిరావులకు గాలి జనార్దన్ రెడ్డి బందువులు 2.74 కోట్ల రూపాయలు ముట్టజెప్పారని ఆరోపణలు వచ్చాయి. గాలి జనార్దన్ రెడ్డి బంధువుల నుంచి తీసుకున్న డబ్బుల విషయంలో తుది లబ్ధిదారు పట్టాభి రామారావేనని, నిందితుల మధ్య సంబంధాలన్నీ ఆయనకు తెలిసి ఉంటాయని ఎసిబి భావిస్తోంది.
గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ వ్యవహారంలో ఎసిబి పట్టాభి రామారావు, చలపతిరావు, రవిచంద్రలతో పాటు యాదగిరిని కూడా అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications