జగన్ ప్రజల్లో ఉండటం వల్లే: ఆజాద్, ఏర్పాట్లపై ఆరా

Ghulam Nabi Azad
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో సానుభూతిని కోల్పోతాడని కేంద్రమంత్రి, ఎపి కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఆదివారం అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీతో పాటు హైదరాబాద్ వచ్చిన ఆజాద్ తిరిగి వెళ్లే సమయంలో ఓ ఆంగ్ల దినపత్రికతో ఆయన మాట్లాడారు. సానుభూతి వల్లే జగన్ పార్టీ విజయం సాధించిందని, భవిష్యత్తులో ఆ ప్రభావం ఉండదని చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత గత రెండేళ్లుగా జగన్ ప్రజలలో ఉంటున్నారని, కానీ కాంగ్రెసు పార్టీ మాత్రం ప్రజలకు దూరమైందని అభిప్రాయపడ్డారు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి తమ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలలోకి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇక నుండి తమ పార్టీ నాయకులు వివరిస్తారని చెప్పారు. గత రెండేళ్లుగా ఓదార్పు యాత్ర, ధర్నాలు తదితర కార్యక్రమాల పేరిట జగన్ దాదాపు ప్రతి ఇంటిని తట్టి ప్రజల్లోకి వెళ్లారని చెప్పారు.

ఉప ఎన్నికలలో ఆ అంశం ఆయనకు లబ్ధి చేకూర్చిందని చెప్పారు. రాష్ట్రంలో మార్పులు చేర్పులపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఇప్పటికే పదిమంది మంత్రులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ పార్టీ తప్పు ఒప్పులపై ఓ నివేదిక ఇవ్వనుందని చెప్పారు. ఏం చేస్తే పార్టీకి లాభమో వారు తమ నివేదికలో అందించనున్నారని చెప్పారు. తెలంగాణ అంశంపై స్పందిస్తూ... పార్టీ తన నిర్ణయం ప్రకటించేందుకు కొంత సమయం తీసుకుంటుందని చెప్పారు.

కాగా అంతకుముందు జూబ్లీహాల్ సమావేశానికి మిత్ర పక్షాలను పిలవకపోవడంపై ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ రాక సమాచారం, ఆయనతో భేటీకి ఏర్పాట్లు తదితరాలపై సమాచారాన్ని మిత్రపక్షాలకు ఇవ్వకపోతే ఎలాగని రాష్ట్ర నేతలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నై నుంచి ప్రణబ్‌తో హైదరాబాద్‌కు వచ్చేముందే ఏర్పాట్లపై రాష్ట్ర ముఖ్యనేతలను ఆయన ఆరా తీశారని సమాచారం. ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను సిఎల్పీ భేటీకి ఆహ్వానించారా? అని ప్రశ్నించారట.

పిలవలేదని చెప్పడంతో.. ప్రణబ్ బస చేసే హోటల్ వద్దకు ఎంఐఎం ప్రతినిధులు కలిసేందుకు ఏర్పాట్లు చేశారో లేదోనని ఆరాతీశారు. దాని పైనా రాష్ట్ర నేతల నుంచి సమాధానం రాలేదట. దాంతో.. అసహనానికి లోనై, తక్షణమే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌తో ఆజాద్ ఫోన్లో మాట్లాడారు. ప్రణబ్‌ను కలిసేందుకు ఆహ్వానించగా, తాను ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ఉన్నానని.. అందువల్ల స్వయంగా రాలేనని, అయితే ఎమ్మెల్యేలను మాత్రం పంపుతానని అసద్ హామీ ఇచ్చారు. ఇలా అప్పటికప్పుడు పిలవడంపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కాస్త అసహనానికి లోనయ్యారు.

అందుకే తాను వెళ్లకుండా ఎమ్మెల్యేలను పంపారట. ప్రణబ్‌కు ఓటు వేయాలని తీర్మానించిన సిపిఎం నేతలనూ రాష్ట్ర నాయకులు సంప్రదించలేదని ఆజాద్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులుతో మాట్లాడారు. హైదరాబాద్‌కు వస్తున్న ప్రణబ్‌తో సమావేశం కావాలని ఆహ్వానించారు. కానీ రాఘవులు కూడా తాను ప్రణబ్‌తో భేటీ అయ్యే అవకాశం లేదంటూ నిస్సహాయతను ప్రకటించారు. ఇదే సమయంలో ఖమ్మం పర్యటనలో ఉన్న లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్‌తోనూ ఆజాద్ మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ అభ్యర్థన పట్ల జెపి సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్‌కు వచ్చాక ఈ అంశాలన్నింటిపైనా రాష్ట్ర నేతల వద్ద ఆజాద్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+