వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నడలో కొత్త ట్విస్ట్: బుసకొడుతున్న సదానంద వర్గం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sadananda Gowda - Gadkari
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటక రాజకీయంలో కొత్త జగడం ప్రారంభమయింది. ముఖ్యమంత్రిగా సదానంద గౌడ రాజీనామా, జగదీష్ శెట్టార్‌కు బాధ్యతలు అప్పగించడంతో కర్నాటక సంక్షోభం ముగిసిందని అందరూ భావించారు. కానీ సదానంద వర్గం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. మంత్రి పదవుల విషయంపై సదానంద వర్గం పట్టుబడుతోంది. దీంతో కొలిక్కి వచ్చిందనుకున్న విషయం కాస్త మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.

తన డిమాండ్ మేరకు సదానందను తొలగించడంతో యడ్డీ, ఆయన వర్గం చల్లబడింది. సదానంద కూడా అధిష్టానం సూచనల మేరకు రాజీనామా చేశానని, భవిష్యత్తులో పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అయితే సదానంద వర్గం మాత్రం తమకే ఎక్కువ మంత్రి పదవులు కావాలంటోంది. ముఖ్యమంత్రి పదవి మీరు తీసుకుంటున్నప్పుడు ఎక్కువ మంత్రి పదవులు మాకు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.

యడ్డీ డిమాండ్ మేరకు ముఖ్యమంత్రిని మార్చిన అధిష్టానానికి మంత్రి వర్గం అంశం కొత్త నొప్పిగా తయారయింది. కర్నాటక కొత్త ఎపిసోడ్‌ను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి. కాగా అంతకుముందు సదానంద తొలగింపు ద్వారా మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. కర్నాటక ముఖ్యమంత్రి సదానంద గౌడ ఆదివారం ఉదయం తన పదవికి రాజీనామా చేశారు. సదానంద రాజీనామా చేసినట్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఆదివారం ఉదయం గడ్కరీ.. రాజీనామా సమర్పించిన సదానంద, ఇతర సీనియర్ నేతల సమక్షంలో ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా సదానంద గౌడ పైన ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పారు. సదానంద తమకు రాజీనామా లేఖను ఇచ్చారని చెప్పారు. నాయకత్వ మార్పు కోసం పార్టీ సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్ కర్నాటకకు వెళతారని చెప్పారు. పార్టీ సీనియర్ నేత జగదీష్ శెట్టార్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. కాగా సదానందను సిఎం పీఠం నుండి దింపి తన వర్గం నేత శెట్టార్‌కు బాధ్యతలు అప్పగించాలన్న యడ్డీ తన పంతం నెగ్గించుకున్నారు.

కాగా ఈశ్వరప్ప లేదా అశోక్‌లలో ఎవరో ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారు. సదానంద గౌడ 2011 ఆగస్టులో అధిష్టానం నిర్ణయం మేరకు యడ్డీ నుండి సిఎం బాధ్యతలు స్వీకరించారు. యడ్యూరప్ప పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. తొలుత సదానందను యడ్డీనే సూచించారు. ఆ తర్వాత వచ్చిన విభేదాల కారణంగా అతనిని తొలగించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.

తనకు డెబ్బైకి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని యడ్డీ అధిష్టానాన్ని హెచ్చరించారు. యడ్డీ సూచనల మేరకు ఇటీవల తొమ్మిది మంది మంత్రులు రాజీనామా కూడా చేశారు. మరో ఆరుగురు ఎంపీలు రాజీనామాకు సిద్ధపడ్డారు. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన అధిష్టానం యడ్డీకి సిఎం మార్పుపై హామీ ఇచ్చింది. దీంతో మంత్రులు రాజీనామాలు వెనక్కి తీసుకున్నారు. అనంతరం గౌడను ఢిల్లీకి పిలిపించిన అధిష్టానం ఆయనకు నచ్చజెప్పి రాజీనామా చేయించింది.

English summary

 BJP senior leader Sadananda Gowda camp leaders are demanding more portfolios in Jagadish Shettar's cabinet on Sunday. Sadananda has resigned to his chief minister's post on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X