Kakinada - Lingampalli: కాకినాడ-లింగంపల్లి ప్రయాణికులకు గుడ్ న్యూస్..! రేపటి నుంచే..!
తెలుగు రాష్ట్రాల్లో వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రమయ్యాయి. రైళ్లలో ప్రయాణించాలంటే ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఉన్న రైళ్లలో సీట్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ-లింగంపల్లి (Kakinada - Lingampalli) రూట్ లో రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు నడపబోతున్నారు.
కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి స్టేషన్ కు మే 1, 2, 3 తేదీల్లో రైలు నంబర్ 07773 రైలు సాయంత్రం 6.55కు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది. అలాగే లింగంపల్లి నుంచి కాకినాడకు మరో ప్రత్యేక రైలు నంబర్ 07774 మే 2, 3, 4 తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు కాకినాడ టౌన్ స్టేషన్ కు మరుసటి రోజు ఉదయం 7.45కు చేరుకుంటుంది. ఈ రెండువైపులా రైళ్లకు సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు.

వేసవిలో హైదరాబాద్ నుంచి కాకినాడకు వచ్చి తిరిగి వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైళ్లు ఉపయోగపడనున్నాయి. అలాగే వేసవి రద్దీ నేపథ్యంలో ఇతర రైళ్లలో టికెట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న వారికి కూడా ఈ రైళ్లు పనికొస్తాయి. ముఖ్యంగా కాకినాడ వంటి లూప్ మార్గంలో నడిచే రైళ్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి, అలాంటి వారు ఈ రైళ్లలో సులువుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే విజయవాడ-హైదరాబాద్ మార్గం కాకుండా గుంటూరు మార్గంలో ఉన్న స్టేషన్ల నుంచి హైదరాబాద్ కు టికెట్లు బుక్ చేసుకునే వారికి కూడా ఈ రైళ్లు ఉపయోగపడతాయి.














Click it and Unblock the Notifications