ఇక ప్రతిరోజు కాకినాడ-లింగంపల్లి ట్రైన్ - ఈ స్టేషన్‌లో అదనపు స్టాప్..!!
కాకినాడ మరియు హైదరాబాద్ మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అత్యంత ఆదరణ కలిగిన కాకినాడ టౌన్ - లింగంపల్లి - కాకినాడ టౌన్ ఎక్స్‌ప్రెస్ (Train No. 12775/12776) సర్వీసును పెంచుతూ రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వారానికి మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ రైలు, ఇకపై ప్రతీ రోజూ ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
రోజూ అందుబాటులోకి.. ఎప్పటి నుంచంటే?
రైల్వే బోర్డు ఆమోదించిన వివరాల ప్రకారం, ఈ రైలు సర్వీసుల ఫ్రీక్వెన్సీ మార్పులు ఈ క్రింది తేదీల నుండి అమలులోకి వస్తాయి:
- రైలు నెం. 12775 (కాకినాడ టౌన్ - లింగంపల్లి): ప్రస్తుతం మంగళ, గురు, ఆదివారాల్లో నడుస్తున్న ఈ రైలు, ఏప్రిల్ 22, 2026 నుండి ప్రతిరోజూ నడుస్తుంది.
- రైలు నెం. 12776 (లింగంపల్లి - కాకినాడ టౌన్): ప్రస్తుతం సోమ, బుధ, శుక్రవారాల్లో నడుస్తున్న ఈ రైలు, ఏప్రిల్ 21, 2026 నుండి ప్రతిరోజూ నడుస్తుంది.

సామర్లకోటలో అదనపు స్టాపింగ్
ఈ రైలు సర్వీసును పెంచడంతో పాటు, ప్రయాణికుల సౌకర్యార్థం సామర్లకోట రైల్వే స్టేషన్‌లో అదనపు స్టాపింగ్‌ను కూడా రైల్వే శాఖ కేటాయించింది. రోజూ నడిచే ఈ రైలు సామర్లకోటలో కింది సమయాల్లో ఆగుతుంది:
- కాకినాడ టౌన్ - లింగంపల్లి (12775): రాత్రి 20:35 గంటలకు సామర్లకోట చేరుకుని, 20:37 గంటలకు బయలుదేరుతుంది.
- లింగంపల్లి - కాకినాడ టౌన్ (12776): తెల్లవారుజామున 04:55 గంటలకు సామర్లకోట చేరుకుని, 04:57 గంటలకు బయలుదేరుతుంది.
కాకినాడ - హైదరాబాద్ మార్గంలో నిత్యం ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు మరియు వ్యాపారులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది. వారానికి మూడు రోజులే ఉండటంతో టికెట్ల లభ్యత కష్టంగా ఉన్న తరుణంలో, ఈ రైలును 'డైలీ సర్వీస్'గా మార్చడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎ. శ్రీధర్ కోరారు














Click it and Unblock the Notifications