PF డబ్బులు ఆగిపోయాయా.. అయితే ఈ కొత్త వెబ్ సైట్ మీ కోసమే
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎప్పుడో ఏళ్ల క్రితం కంపెనీలు మారినప్పుడు లేదా పాత పిఎఫ్ (PF) ఖాతాల వివరాలు మర్చిపోయినప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియక ఇబ్బంది పడే కోట్లాది మంది ఉద్యోగుల కోసం 'ఇ-ప్రాప్తి' (E-PRAAPTI) అనే సరికొత్త డిజిటల్ పోర్టల్‌ను తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా వెల్లడించారు.
చాలామంది ఉద్యోగులు గతంలో పీఎఫ్ ఖాతాలు ఉన్నప్పటికీ, వాటికి యూఏఎన్ (UAN) నంబర్ లేకపోవడం వల్ల లేదా ఆ వివరాలు గుర్తులేకపోవడం వల్ల పాత డబ్బులను క్లెయిమ్ చేయలేకపోతున్నారు. అలాంటి పాత లేదా నిలిపివేయబడిన (Inoperative) ఖాతాలను గుర్తించి, ట్రాక్ చేసి, ప్రస్తుత ఖాతాతో లింక్ చేయడానికి ఈ 'ఇ-ప్రాప్తి' వేదిక ఉపయోగపడుతుంది. దీని పూర్తి పేరు 'EPF Aadhaar-based Access Portal for Tracking Inoperative Accounts'.

యూఏఎన్ (UAN) లేకపోయినా పర్వాలేదు!
సాధారణంగా పీఎఫ్ ఖాతాను యాక్సెస్ చేయాలంటే 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తప్పనిసరి. అయితే, UAN వ్యవస్థ రాకముందు పనిచేసిన వారికి, పాత ఖాతా ఐడీలు గుర్తుండి UAN లేని వారికి ఈ పోర్టల్ వరం లాంటిది. ఆధార్ కార్డు ద్వారా సురక్షితంగా లాగిన్ అయ్యి, పాత ఖాతా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ పాత ఖాతాను ప్రస్తుత UAN నంబర్‌కు లింక్ చేసి, నిలిచిపోయిన సొమ్మును తిరిగి పొందే వీలుంటుంది.
నిర్వీర్య ఖాతాలు అంటే ఏమిటి?
ఏదైనా పీఎఫ్ ఖాతాలో వరుసగా మూడు సంవత్సరాల పాటు ఎటువంటి విరాళాలు (Contributions) జమ కాకపోతే, దానిని 'నిర్వీర్య ఖాతా' (Inoperative Account)గా వర్గీకరిస్తారు. ఉద్యోగ విరమణ చేసినా, శాశ్వతంగా విదేశాలకు వెళ్లిపోయినా లేదా సభ్యుడు మరణించినా అడ్రస్ లేని ఖాతాలు ఇలా నిలిచిపోతాయి. సాధారణంగా ఇలాంటి ఖాతాలపై వడ్డీ లభించదు. అందుకే ఇలాంటి నిలిచిపోయిన డబ్బులను వెంటనే గుర్తించి, కొత్త ఖాతాకు బదిలీ చేసుకోవడం ఉత్తమం.
ఎవరికి ఎక్కువ ఉపయోగం?
- పాత ఉద్యోగులకు: UAN నంబర్ అమల్లోకి రాకముందు (2014 కంటే ముందు) పనిచేసి, పాత పీఎఫ్ ఖాతా వివరాలు సరిగ్గా లేని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
- కంపెనీలు మారిన వారికి: గతంలో పనిచేసిన కంపెనీల పిఎఫ్ ఐడీలు తెలిసి ఉండి, వాటిని ప్రస్తుత ఖాతాతో లింక్ చేయని వారు తక్షణమే ప్రయోజనం పొందవచ్చు.
- బదిలీ కోరుకునే వారికి: మీరు ప్రస్తుతం వేరే సంస్థలో పనిచేస్తుంటే, పాత నిలిచిపోయిన సొమ్మును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా కొత్త ఖాతాకు సులభంగా బదిలీ చేసుకోవచ్చు.
మొదటి దశలో సభ్యత్వ ఐడీలు (Member IDs) గుర్తుండి, ఖాతాలు నిలిచిపోయిన వారికి ఈ పోర్టల్ ద్వారా వేగవంతమైన సేవలు అందనున్నాయి. మీ పాత పీఎఫ్ సొమ్మును వెలికి తీయడానికి ఈ డిజిటల్ విప్లవం ఎంతో తోడ్పడనుంది.














Click it and Unblock the Notifications