మానసిక స్థితి తెలుస్తోంది: బాబుపై ఉప్పులేటి కల్పన

పార్టీని వీడినవారిపై తిరగబడాలని చెప్పడంతోనే చంద్రబాబు మానసిక స్థాయి ఏమిటో తెలిసిపోతోందని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మానసిక స్థాయి తప్పినట్లుందని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు కూడా కాంగ్రెసు నుంచి తెలుగుదేశంలోకి వచ్చారని, అప్పుడు ప్రజలు తిరగబడి ఉంటే చంద్రబాబు ఎక్కడ ఉండేవారని ఆమె అన్నారు.
ఎలాంటి వివరణ కోరకుండా ఏకపక్షంగా తనను సస్సెండ్ చేశారని, తనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని ఆమె చెప్పారు. మేకపాటి తల్లి మరణించడంతో పరామర్శించడానికి వెళ్లానని ఆమె వివరణ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో అగ్రవర్ణాలకో న్యాయం, దళితులకో న్యాయమా అని ఆమె ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీని ఆ భగవంతుడే రక్షించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీపై భరోసా కోల్పోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు తమ భవిష్యత్తును చూసుకుంటున్నారని ఆయన విడిగా బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలుగుదేశం పార్టీ రానురాను ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోతోందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణలు ఆ పార్టీని మరింత పలుచన చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తా అని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని ఆయన అన్నారు. సిబిఐ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. ఇప్పటికైనా సిబిఐ తన తప్పు తెలుసుకుని వ్యవహరించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications