లోకేష్ కోసమే: బాబుపై నాని ఫైర్, ఎన్టీఆర్‌కు వివరణ

Kodali Nani
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో తాను టిడిపిని వీడే ప్రసక్తి లేదన్నారు. అయితే తనపై పార్టీ సస్పెన్షన్ వేటు వెనక్కి తీసుకోకుంటే మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. జగన్ వద్ద తాను ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు. కావాలంటే ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు.

తనను తెలుగుదేశం పార్టీ నుండి ఎందుకు బహిష్కరించారో మొదట చెప్పాలని బాబును ప్రశ్నించారు. పార్టీలో పని చేయాలంటే ఇతర పార్టీ నేతలతో వ్యక్తిగత పరిచయం లేకుండా పని చేయాలా అని ప్రశ్నించారు. పార్టీలో తనకు స్వతంత్రం లేదా అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డితో తనకు వ్యక్తిగత పరిచయం ఉందని, అతనిని గతంలో నాలుగైదుసార్లు కలిశానని, ఇప్పుడు అలాగే కలిశానని, కలిసినంత మాత్రాన బహిష్కరిస్తారా అన్నారు. తన బహిష్కరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తనకు చంద్రబాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, అలాగే జిల్లాకు చెందిన ఆయన ఊరకుక్కలతో తనను తిట్టించారని వారిచే కూడా క్షమాపణలు చెప్పించాలని అన్నారు. తానును బాబును హెచ్చరిస్తున్నానని అన్నారు. చంద్రబాబుకు కూడా కాంగ్రెసు నేతలతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయని దానికి ఆయన ఏం సమాధానం చెబుతారన్నారు. జగన్ కష్టాలలో ఉన్నాడు కాబట్టే తాను వెళ్లి కలిశానని అన్నారు.

టిడిపి ఏమైనా బాబు సొత్తా అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావును చెప్పులతో, రాళ్లతో కొట్టి ఎలా అవమానించారో ఇప్పుడు కూడా బాబు తనను పార్టీ నుండి గెంటివేసి అలాగే బహిష్కరించారన్నారు. తన బహిష్కరణపై తాను కోర్టుకు వెళ్లి పోరాటం చేస్తానని చెప్పారు. తాను జగన్ నుండి రూ.30 కోట్లు తీసుకున్నానని బాబు ఆరోపణలు చేస్తున్నారని, ఒక్క రూపాయి తీసుకోలేదన్నారు.

చంద్రబాబే రాజ్యసభ సీటు కోసం రూ.300 కోట్లు తీసుకున్నారని, పార్టీని గంపగుత్తగా కాంగ్రెసుకు తాకట్టు పెట్టారని, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని టార్గెట్ చేసుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. తాను పార్టీని వీడలేదని మెడపట్టి బయటకు గెంటేశారన్నారు. గుడివాడ ప్రజలు స్వర్గీయ ఎన్టీఆర్‌ను చూసి గెలిపిస్తున్నారన్నారు. తనను కొట్టాలని గుడివాడ ప్రజలకు బాబు పిలుపునిస్తున్నారని, తనను కాదని ఆయననే చెప్పులతో రాళ్లతో కొట్టే రోజు వస్తుందన్నారు.

బాబుకు బాకా ఉదే వారికే టిడిపిలో స్థానం ఉందని, ఎన్టీఆర్ అభిమానులను వ్యూహాత్మకంగా బయటకు పంపిస్తున్నారని విమర్శించారు. అయినా కొట్టడం అవమానం కాదని, డిపాజిట్ లేకుండా, ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడమే సిగ్గు చేటు అన్నారు. టిడిపిని నడిపిస్తోంది చంద్రబాబు కాదని ఢిల్లీ కాంగ్రెసు పెద్దలు అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, హోంమంత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నారని మండిపడ్డారు.

నందమూరి తారక రామారావు అభిమానిగా తాను పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. తనపై పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యపడి రెండు రోజులుగా తాను నిద్ర పోలేదన్నారు. సంజాయిషీ ఇచ్చే అవకాశమివ్వలేదన్నారు. తనను రాజకీయ వ్యభిచారి అనడం సరికాదన్నారు. పార్టీలో బాబు నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. బాబు తన తనయుడు లోకేష్ కుమార్ కోసం ఎన్టీఆర్ అభిమానులను బయటకు గెంటివేస్తున్నారన్నారు.

బాబు చంద్రగిరిలో భయంతో కుప్పం పారిపోయాడన్నారు. బాబుకు తెలంగాణలో, రాయలసీమలో, ఆంధ్రాలో ఎక్కడా స్థానం లేకుండా పోయిందన్నారు. తాను బాబు దయాదాక్షిణ్యాలతో రాజకీయాలలోకి రాలేదని, కేవలం స్వర్గీయ ఎన్టీఆర్ పైన ఉన్న అభిమానంతో, హరికృష్ణ ప్రోత్సాహంతో రాజకీయాలలోకి వచ్చానని అన్నారు. గుడివాడ ప్రజలు గెలిపించింది ఎన్టీఆర్ పైన అభిమానంతో అన్నారు.

బాబు మొదటి నుండి వెన్నుపోటు దారుడే అన్నారు. గతంలో మంత్రి గల్లా అరుణ కుమారి తండ్రికి వెన్నుపోటు పొడిచారని, స్వర్గీయ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని చివరకు పొత్తు పెట్టుకున్న బిజెపి, తెరాస, కమ్యూనిస్టు పార్టీలకూ వెన్ను పోటు పొడిచారని మండిపడ్డారు. తనను కుట్ర, కుతంత్రలతోనే పార్టీ నుండి బయటకు పంపారని చెప్పారు. బాబు అధ్యక్షుడిగా ఉన్నంత కాలం పార్టీ బాగుపడదన్నారు. బాబు తీరుతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు.

శత్రువు అయినప్పటికీ చనిపోయిన వాళ్ల గురించి మంచిగా మాట్లాడమనేది మన సంప్రదాయమని కాని బాబు మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పైన మాత్రం ఇప్పటికీ మండిపడుతున్నారన్నారు. తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయకుంటే కోర్టుకు వెళతానని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో బాబు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నారన్నారు. తనకు రాజకీయాల నుండి తప్పుకునే ఉద్దేశ్యమేదీ లేదన్నారు.

తాను ఎన్టీఆర్ పైన అభిమానంతో పార్టీకి లాయాల్టీగా ఉన్నానని, బాబుపై విశ్వాసంతో కాదన్నారు. ఎన్టీఆర్ నీవంటి పంది కొక్కుల కోసం పార్టీ పెట్టలేదని ధ్వజమెత్తారు. తన భవిష్యత్తు చంద్రబాబు చేతిలోనే ఉందన్నారు. జగన్ తనను పార్టీలోకి ఆహ్వానించారని, సస్పెన్షన్ ఎత్తివేయకుంటే తాను అతనితో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. దేవినేని ఉమా మహేశ్వర రావు తన తమ్ముడిని జగన్ పార్టీకి ఎంతకు అమ్ముకున్నారని ప్రశ్నించారు.

తాను డబ్బులకు కక్కుర్తి పడి ఉంటే వైయస్ ఉన్నప్పుడే కాంగ్రెసులో చేరేవాడినని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబే తన టార్గెట్ అని చెప్పారు. తనది పారిపోయే స్వభావం కాదన్నారు. తనకు ఎన్టీఆర్ దైవం అన్నారు. తనకు జూనియర్ ఎన్టీఆర్ సీటు ఇప్పించలేదని, డిమాండ్ చేసి ఇప్పించారన్నారు. తాను ఎందుకు అసంతృప్తితో ఉన్నానో జూనియర్‌కు తెలిసి ఉండకపోవచ్చునని అన్నారు. తాను పార్టీ వీడనని చెప్పాక పునరాలోచన అనే ప్రశ్నకు అర్థం లేదన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ప్రేమ, అభిమానం ఉందని, నందమూరి కుటుంబం ప్రత్యేక అభిమానముందని చెప్పారు. వారితో అలాగే తనక సత్సంబంధాలు కొనసాగుతాయని చెప్పారు. దివంగత వైయస్ స్వర్గీయ ఎన్టీఆర్‌లా పని చేశారని అన్నారు. జగన్, వైయస్ లక్ష కోట్లు దోచుకున్నారన్న టిడిపి నేతలు ఆ నోట్లను లెక్క బెట్టారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో బాబుకు హక్కు లేదన్నారు. కుళ్లు, కుట్ర రాజకీయాలు బాబు పేటెంట్ హక్కు అన్నారు. బాబు చీఫ్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారన్నారు. జనం గడ్డి పెట్టాకే చంద్రబాబు జగన్ గురించి మాట్లాడటం మానేశారన్నారు. నాని జగన్ స్క్రిప్ట్ చదివారన్నారు. తనతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు జగన్ పార్టీలోకి వస్తారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+