హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా డబ్బు నాకిచ్చేయండి: కోర్టులో నిమ్మగడ్డ ప్రసాద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Nimmagadda Prasad
హైదరాబాద్: వాన్‌పిక్ ప్రాజెక్టు అమలులో ప్రభుత్వానికి ఏవైనా అభ్యంతరాలు, ఇబ్బందులు ఉంటే తన పెట్టుబడులను తిరిగి ఇచ్చేయాలని పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చేతిలో అన్ని అవకాశాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా తనను అరెస్ట్ చేసి వేధిస్తోందని ఆయన ఆరోపించారు.

ఆధారాలు లేకుండా సీబీఐ వాదిస్తోందని తన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా నిమ్మగడ్డ సోమవారం సిబిఐ కోర్టుకు చెప్పారు. వాన్‌పిక్ ప్రాజెక్టు ఒప్పందం పెద్ద కుట్రగా పేర్కొంది. పారిశ్రామిక కారిడార్‌కు 24వేల ఎకరాలు కేటాయించాలన్న విషయాన్ని కేబినెట్‌కు చెప్పకుండా అప్పటి మంత్రి(మోపిదేవి) ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని సిబిఐ వాదించింది. కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులు హోరాహోరీగా సుదీర్ఘ వాదనలు వినిపించారు.

ప్రభుత్వ నిబంధనల మేరకే ప్రాజెక్టు అమలవుతోందని, నచ్చకపోతే నిమ్మగడ్డ ఇప్పటివరకు వ్యయం చేసిన రూ.800 కోట్లను తిరిగి ఇచ్చేయాలని, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనలో భాగంగా ఏ ప్రభుత్వం అయినా రాయితీలు ఇవ్వడం సహజమని నిమ్మగడ్డ ప్రసాద్ తరఫు న్యాయవాది అన్నారు. దాన్ని సిబిఐ ఎలా తప్పుపడుతుందని, దానికి ఎందుకంత ఆందోళన అని, మే 12న నోటీసు ఇచ్చి, 14న నిమ్మగడ్డను అరెస్టు చేసిందని, ఆ రెండు రోజుల్లో ఏ తప్పును పట్టుకుందని అన్నారు.

నిమ్మగడ్డ ప్రసాద్ సహకరించలేదని సిబిఐ ఆరోపణలు చేస్తోందని, నిమ్మగడ్డ చెప్పనిదే ఆయన ఉద్యోగులు సీబీఐకి సహకరించారా అని, కారిడార్‌లో రియల్ ఎస్టేట్ వ్యవహారాలు జరుగుతున్నాయని కూడా ఆరోపిస్తోందని, వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగానే కొన్ని సంస్థలకు షరతులతో కూడిన అనుమతినిచ్చామని నిమ్మగడ్డ న్యాయవాది వాదించారు.

డిఫెన్స్ వాదనపై సిబిఐ లాయర్ బళ్లా రవీంద్రనాథ్ ఘాటుగా స్పందించారు. వాన్‌పిక్ ప్రాజెక్టు ఒప్పందాల్లో అనేక ఉల్లంఘనలు జరిగాయని, కొత్త కంపెనీని నిమ్మగడ్డ రంగంలోకి దించారని, రైతుల వద్ద రూ.70 వేల నుంచి రూ.1.50 లక్షలకు సేకరించిన ఎకరా భూమిని, రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎకరా రూ.12.50 లక్షలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. అసలు రాయితీ ఒప్పందంలో ఇండస్ట్రియల్ కారిడార్‌కు 24వేల ఎకరాలు కేటాయిస్తున్నట్లు లేదని, ఆ విషయాన్ని అప్పటి మంత్రి(మోపిదేవి) కేబినెట్‌కు చెప్పలేదని, నిమ్మగడ్డతో కలిసి ఆయన కుట్రకు పాల్పడినందునే ఇంత పెద్ద విషయాన్ని కూడా దాచారని కోర్టుకు చెప్పారు.

వాన్‌పిక్ పోర్టు పేరుతో సేకరించాల్సిన భూముల్ని వాన్‌పిక్ ప్రా జెక్ట్స్ పేరుతో సేకరించారని, వాన్‌పిక్ ప్రాజెక్ట్సు నిమ్మగడ్డ సొంత కంపెనీ అని, దీంతో సేకరించిన భూములు ఆయనకే దఖలు పడతాయి తప్ప ప్రభుత్వ పరిధిలోకి రావని ఆయన అన్నారు. ఒప్పందం ప్రకారం చూసినా లాభాల్లో ప్రభుత్వానికి నామమాత్రంగా 2.5% వాటానే దక్కే పరిస్థితి ఉందని, రైతులకు రూ.150 కోట్లు మాత్రమే ఇచ్చి, రూ.450 కోట్లు ఇచ్చినట్లు చెప్పి ప్రాజెక్టు వ్యయం ఎక్కువ చూపారని అన్నారు.

తప్పుగా చూపెడుతున్న రూ.300 కోట్లలో రూ.150 కోట్లు జగతి సంస్థల్లోకి పెట్టుబడులుగా మళ్లాయని, దీంతో క్విడ్‌ప్రోకో జరిగినట్లు స్పష్టమవుతోందని ఆయన వాదించారు. వాదనలు ముగియకపోవడంతో న్యాయమూర్తి కేసును మంగళవారానికి వాయిదా వేశారు.

English summary
Industrialist Nimmagadda Prasad alias Matrix Prasad urged to the government through court that to return his investment in Vanpic project. He said that he has not violated rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X