టీటీడీకి 10.33 ఎకరాలు రాసిచ్చిన బీజేపీ ప్రభుత్వం
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 83,812 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 38,345 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.31 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పట్టింది. ఆ ఒక్కరోజే 2.70 లక్షలమంది అన్నప్రసాదాలను స్వీకరించారు. 4.31 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ కార్యక్రమంలో టీటీడీ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలో అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం టీటీడీకి 10.33 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. కామరూప్ జిల్లాలోని సోనాపూర్ సర్కిల్ పరిధిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం కోసం ఈ భూమిని ప్రభుత్వం టీటీడీకి మంజూరు చేసింది.
ఈ భూమిని తాజాగా టీటీడీ అధికారికంగా స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా టీటీడీకి అందాయి. అస్సాం మెట్రోపాలిటన్ డిప్యూటీ కమిషనర్ ఈ ల్యాండ్ పొజెషన్ సర్టిఫికెట్‌ను అందజేశారు. టీటీడీ ఎస్టేట్ అధికారి సువర్ణమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సురేంద్ర రెడ్డికి వీటిని అప్పగించారు.
అస్సాంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం గతంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఉన్నతాధికారులు అక్కడి ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపి ఆలయ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ పాలకమండలి కూడా అక్కడి ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖలు రాశారు. దీంతో సోన్ పూర్ లో శ్రీనివాసుడి ఆలయ నిర్మాణానికి అస్సాం ప్రభుత్వం అంగీకరించింది.
ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి త్వరలో భూమిపూజ నిర్వహించనున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. ఈశాన్య భారతంలో సనాతన ధర్మ ప్రచారానికి, ఆధ్యాత్మిక చైతన్య విస్తరణకు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిమంత బిశ్వ శర్మ, అస్సాం ప్రభుత్వానికి బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications