హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు రాజకీయం: ఏదీ ఆనాటి వైభవం?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ఓ అంతర్జాతీయంగా కీర్తి సాధించిన నాయకుడు. అలైక్ పదాంసీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ - ఒకటేమిటి, హైదరాబాదును అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు పారిశ్రామికవేత్తలు బారులు - ఐటి పరిశ్రమకు అత్యంత ఆశావహమైన వాతావరణం. కొత్త తరానికి కొత్త నాయకుడిగా, ఆధునిక భావాలతో ముందుకు వచ్చిన మార్గదర్శిగా చంద్రబాబు కీర్తని అందుకున్నారు. అందుకు తగినట్లుగానే ఐటి ప్రొఫెషనల్‌కు ఆదర్శ నాయకుడిగా నిలిచారు. కానీ ఇప్పుడేమైందనే ఒక ప్రశ్న ఉదయిస్తోంది. తాజాగా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వ్యవహారం, నలుగురు శాసనసభ్యుల తీరు, వారిపై సస్పెన్షన్ వేటు తెలుగుదేశం పార్టీ తీరుపై ప్రశ్నలకు అవకాశం కల్పిస్తోంది.

గత 12 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే - చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నట్లే కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా ఆయన కొన్ని కొత్త నిర్ణయాలను తీసుకున్నారు, కొత్త ప్రతిపాదనలను ముందు పెట్టారు. 2004, ఆ తర్వాత 2009లో ఓడిపోయిన తర్వాత తన భావాలను, నిర్ణయాలను ఆయన మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసును అధికారంలోకి తేవడానికి వరాలు ఇస్తూ పోతుంటే పోటీ పడి ఆయన ఇంకా ఎక్కువ వరాలు ప్రకటించారు. అయినా ఫలితం కనిపించలేదు.

పార్టీ నుంచి ఒక్కరొక్కరే వెళ్లిపోవడం కూడా ఆనవాయితీగా మారింది. పార్టీని ఎవరో ఒకరు వీడివెళ్తున్న ప్రతిసారీ - నాయకులు వెళ్లినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదని, కార్యకర్తలు పార్టీ వెంట ఉన్నారని చెబుకుంటూ రావడం చంద్రబాబుకు, పార్టీ నాయకులకు ఓ అలవాటుగా మారినట్లే కనిపిస్తోంది. అయితే, పార్టీ మాత్రం వరుసగా వచ్చిన ఏ ఉప ఎన్నికల్లో కూడా తన సత్తా చాటలేకపోయింది. 2009 ఎన్నికల్లో ప్రస్తుత కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా తెలుగుదేశం పార్టీని దెబ్బ తీస్తే, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సవాల్‌గా నిలిచారు.

పార్టీలో నాయకులు చాలా మందే కనిపిస్తున్నా, చంద్రబాబు తానొక్కడే అన్నీ అయి వ్యవహారాలు నడుపుతున్నారు. ప్రజల్లోకి వెళ్లాలన్నా, పార్టీ నిర్ణయాలు చేయాలన్నా, వాటిని అమలు చేయాలన్నా ఆయనే. అంతా ఒక్కరే అయి చేయాల్సిన పరిస్థితి. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు ఇప్పుడు తన సొంత గూటిని చక్కబెట్టుకోలేక సతమవుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచే కాదు, జాతీయ మీడియా నుంచి వ్యక్తమవుతోంది.

చంద్రబాబును జాతీయ మీడియానే కాదు, అంతర్జాతీయ మీడియా కూడా ఆకాశానికెత్తింది. అదే మీడియా ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంపై, పార్టీ తీరుపై విచారకరమైన వ్యాఖ్యానాలు చేస్తోంది. పార్టీలో నెంబర్ టూ లేకపోవడం పార్టీకి పెద్ద లోపంగా చెబుతున్నారు. అయితే, ఆ స్థానాన్ని చంద్రబాబు ఎప్పుడూ ఖాళీగానే ఉంచుతారు. రెండో అధికార కేంద్రం ఏర్పడకుండా ఆయన జాగ్రత్త పడుతుంటారు. దీంతో చంద్రబాబు తర్వాత దిగువ శ్రేణి నాయకులకు గానీ కార్యకర్తలకు గానీ మరొకరు కనిపించే పరిస్థితి లేదు. అంతేకాదు, స్వతంత్రించి పనిచేసే వాతావరణం కూడా లేదని అంటారు.

తన కుమారుడు నారా లోకేష్‌ను పార్టీలోకి తీసుకుని వచ్చి, తనకు తోడుగా ఉంచుకుని, కొన్ని బాధ్యతలు అప్పగించి బరువు దించుకుందామనే చంద్రబాబు ప్రయత్నం కూడా ఫలించడం లేదు. బావమరిది నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ అందుకు ఎప్పటికప్పుడు అడ్డు పడుతూనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌పై చంద్రబాబుకు నమ్మకం ఉన్నట్లు లేదు. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌తో చేతులు కలిపినట్లు ఆయన అనుమానిస్తున్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వ్యాఖ్యానించింది. తన కోడలు బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తేవాలనే డిమాండ్‌పై కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం లేదు. బాలకృష్ణ వస్తానంటున్నారే గానీ ఏ విధమైన పాత్ర పోషిస్తారనేది తేలడం లేదు. మొత్తం మీద, చంద్రబాబు నాయకత్వానికి ప్రస్తుత స్థితి సవాల్‌గా మారిందనే చెప్పాలి.

2014 సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడానికి సమాయత్తం కావడానికి చంద్రబాబుకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు ఎదరువుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మరో ఆరు నెలల్లో ఉప ఎన్నికలు రావచ్చు. ఉప ఎన్నికలను ఎదుర్కోవడంలో కాంగ్రెసు పార్టీయే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా ఇబ్బందులను ఎదుర్కుంటోంది. అయితే, తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిబద్ధతతో కూడిన కార్యకర్తలు ఉన్నారు. వారికి నమ్మకం కలిగించే పని చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే చంద్రబాబు తిరిగి తన సత్తా చాటవచ్చు.

జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ముఖ్యమైన నాయకుడే. రాష్టానికి వచ్చే ముఖ్య నాయకులు, ప్రముఖులు చంద్రబాబు వైపే ఇప్పటికీ చూస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర కూడా కీలకమైందే. అయితే, రాష్టంలో ఆయన పార్టీకి దూరమైన వివిధ వర్గాలను తిరిగి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి. ఆ ప్రయత్నాలు ఫలిస్తే ఆయనకు మళ్లీ తిరుగు ఉండదు.

English summary
Telugudesam party president N Chandrababu is facing several challenges regarding party affairs. Party leaders are vacating the party one by one. Twelve years later Chandrababu Naidu seems to have lost the plot with a steady exodus of party men from the Telugudesam Party (TDP). In the latest, 5 MLAs of TDP defied the party line and cast their vote in the Presidential poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X