విజయమ్మ దీక్ష: సబితాకు ఎంపీ రాములమ్మ ఫిర్యాదు

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణవాదులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విజయశాంతి ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో తెలంగాణవాదులు ఆయా పార్టీల వైఖరిని ప్రశ్నించడం తప్పా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమ నేతలకు ఎర్ర తివాచీ పరుస్తున్నారని మండిపడ్డారు. ఆయన వైఖరి మారకుంటే తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
తెలంగాణ భవనంలోకి పోలీసులు చొచ్చుకెళ్లి కార్యకర్తలపై దాడి చేయడమేమిటని ఆమె ప్రశ్నించారు. మహిళలను కూడా పోలీసులు విడిచి పెట్టలేదన్నారు. ఓ మహిళ పర్యటనకు వస్తున్నారని తెలంగాణ మహిళలపై లాఠీఛార్జ్ చేస్తారా అని ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటిని తాను సబిత దృష్టికి తీసుకు వెళ్లానని, చర్యలు తీసుకుంటానని చెప్పారని తెలిపారు.
కాగా ఇప్పటికే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు మంగళవారం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలిసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేసిన దీక్షకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారని, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని పార్లమెంటు సభ్యులు ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు.
భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన వీడియో సీడీలను కూడా ఆజాద్‌కు ప్రదర్శించి చూపించారు. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని తాము కోరామని, పార్లమెంటు సమావేశాల సమయంలో మరోసారి కలుద్దామని ఆజాద్ చెప్పారని పార్లమెంటు సభ్యుడు రాజయ్య మీడియా ప్రతినిధులతో చెప్పారు. దీన్ని బట్టి తెలంగాణ అంశాన్ని ఇప్పట్లో తేల్చడానికి కాంగ్రెసు అధిష్టానం తేల్చడానికి సిద్ధంగా లేదని అర్థమవుతోందని అంటున్నారు.
వైయస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నాకు భారీ భద్రత కల్పించడంపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజిపి దినేష్ రెడ్డిపై కూడా వారు ఆజాద్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో బలపడేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సహకరిస్తున్నారని వారు ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. విజయమ్మ పర్యటనలో 15వేల మంది పోలీసులను వినియోగించారని, హెలికాప్టర్ ద్వారా ఏరియల్ నిఘా కూడా ఏర్పాటు చేశారని వారు చెప్పారు. ఇది పార్టీకీ ప్రభుత్వానికీ మంచిది కాదని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications